నిధులున్నా..నిర్లక్ష్యం
● బిల్లుల అప్‌లోడ్‌లో హెచ్‌ఎంల అలసత్వం
అనంతపురం ఎడ్యుకేషన్: జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ స్కూళ్ల) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం అందిస్తోంది. ప్రభుత్వం నిధులు కేటాయించినా హెచ్‌ఎంల అలసత్వం కారణంగా వెనక్కుపోయే ప్రమాదం నెలకొంది. వెబ్‌సైట్ క్లోజ్ అయితే దరఖాస్తుకు అవకాశమే ఉండదు. ఓవైపు అధికారులు అప్రమత్తం చేస్తున్నా.. హెచ్‌ఎంలు మాత్రం అలసత్వం వీడడం లేదు. జిల్లాలో మొత్తం 41 ప్రభుత్వ, మోడల్, గురుకుల, బీసీ, ఎస్సీ రెసిడెన్షియల్ ఉన్నత పాఠశాలలు పీఎంశ్రీ పథకానికి ఎంపికయ్యాయి. ఒక్కో పాఠశాలకు రూ.లక్ష నిధులు కేటాయించారు. ఇందులో డ్రగ్ అబ్యూజ్ కార్యక్రమానికి రూ.10 వేలు, ఏక్ భారత్ శ్రేష్టకు రూ. 25 వేలు, ఆర్ట్, కల్చరల్, స్కూల్ వార్షికోత్సవం కార్యక్రమాల నిర్వహణకు రూ.15 వేలు కేటాయించారు. ఇందులో రెండు స్కూళ్లకు మాత్రం రూ.4 లక్షల చొప్పున కేటాయించారు. ఈ నిధులకు సంబంధించిన బిల్లులు ‘ఎస్‌ఎన్‌ఏ–స్పర్శ్’ లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ట్రెజరీలో బిల్లులు పెట్టుకుంటే సంబంధిత మొత్తం ఆయా స్కూళ్ల అకౌంటులో జమ అవుతుంది. 41 స్కూళ్లలో ఇప్పటికీ 8 పాఠశాలలు అప్‌లోడ్ చేయలేదు. దీనిపై రాష్ట్ర, జిల్లా విద్యాశాఖ అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్‌బాబు .. ఏడీ మునీర్‌ఖాన్, అసిస్టెంట్ ఏఎంఓ ఫణిరాజ్, ఏపీఓ మంజునాథ్‌తో సమావేశమై ఆయా హెచ్‌ఎంలకు ఫోన్లు చేసి మాట్లాడారు. వెంటనే దరఖాస్తు చేసుకోకపోతే చర్యలుంటాయని హెచ్చరించారు. వెబ్‌సైట్ క్లోజ్ అయి నిధులు రాకపోతే హెచ్‌ఎంలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బిల్లులు అప్‌లోడ్ చేయని స్కూళ్లలో టీసీ ప్రభుత్వ స్కూల్–పామిడి, జెడ్పీహెచ్‌ఎస్ ఖాదర్‌పేట, జెడ్పీహెచ్‌ఎస్ లక్షంపల్లి, జెడ్పీహెచ్‌ఎస్ పెద్దవడుగూరు, ఏపీఎంఎస్ రాయదుర్గం, జేసీఎన్‌ఆర్ ఎంబీహెచ్‌ఎస్ తాడిపత్రి, జెడ్పీహెచ్‌ఎస్ రాయలచెరువు, ఏపీఎంఎస్ వజ్రకరూరు ఉన్నాయి.
పిచ్చికుక్క దాడి..పది మందికి గాయాలు
చెన్నేకొత్తపల్లి: ఓ పిచ్చికుక్క బుధవారం చెన్నేకొత్తపల్లిలో స్వైర విహారం చేసింది. కనిపించిన వారిపైనంతా దాడి చేసి గాయపరిచింది. పిచ్చికుక్కదాడిలో చెన్నేకొత్తపల్లికి చెందిన రామాంజనేయులు, కాశీరెడ్డి, గణేష్, వీరజిన్నయ్య, కమలకుమార్‌రెడ్డి, రమేష్, రామాంజనేయులు, నరసింహులు, నారాయణమ్మ తదితరులతో పాటు ముష్టికోవెల, కురబవాండ్లపల్లి గ్రామాలకు చెందిన వారు గాయపడ్డారు. మరికొందరు పిచ్చికుక్క దాడి నుంచి తప్పించుకున్నారు. అప్రమత్తమైన స్థానిక యువకులు పిచ్చికుక్క కొట్టి చంపినట్లు తెలుస్తోంది.
నిధులున్నా..నిర్లక్ష్యం


