గాంధీజీ సిద్ధాంతాలను విస్మరిస్తే దేశానికి నష్టం
మడకశిర: గాంధీజీ సిద్ధాంతాలను విస్మరిస్తే దేశానికి నష్టమని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. బుధవారం ఆయన స్వగ్రామమైన మడకశిర మండలం నీలకంఠాపురం నుంచి సతీమణి సునీతతో కలిసి ‘మహాత్మాగాంధీ సందేశ పాదయాత్ర’ను మొదలుపెట్టారు. ఈ పాదయాత్రను స్వాతంత్య్ర సమర యోధుడు, సీనియర్ న్యాయవాది మెళవాయి గోవిందరెడ్డి ప్రారంభించారు. అక్కడి నుంచి మడకశిరకు చేరుకున్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత సిద్ధార్థ పాఠశాల ఆవరణలో జరిగిన సభలో రఘువీరా మాట్లాడారు. గాంధీజీని ఇతర దేశాల్లో ఎంతగానో గౌరవిస్తున్నారని, కానీ మన దేశంలో మాత్రం కొంత మంది అగౌరవ పరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గాంధీజీ ఆశయాలు, విలువలు, సిద్ధాంతాలను విస్మరిస్తే దేశం బలహీన పడడం ఖాయమన్నారు. దేశ వ్యాప్తంగా 12 కోట్ల పేద కుటుంబాలు లబ్ధి పొందుతున్న ఉపాధి హామీ పథకానికి గాంధీజీ పేరు తొలగించడం బాధాకరమన్నారు. గాంధీజీ ఆదర్శాలను యువత, విద్యార్థులకు తెలియజేయడానికే తాను పాదయాత్ర చేపట్టానని తెలిపారు. ప్రజలు భారీసంఖ్యలో తరలివచ్చి సంఘీభావం తెలపడం ఆనందంగా ఉందన్నారు. ఆ తర్వాత పాదయాత్ర మడకశిర నుంచి వడ్రపాళ్యం, చిపులేటి, అయ్యవారిపల్లి మీదుగా బుళ్ల సముద్రం చేరుకుంది. గురువారం అక్కడి నుంచి తడకలపల్లి క్రాస్, కల్లుమర్రి, అగ్రంపల్లి, పరిగి, కొడిగెనహళ్లి మీదుగా సేవామందిర వరకు కొనసాగుతుంది. తొలి రోజు పాదయాత్రలో పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్, కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్ అంబటి రామక్రిష్ణ యాదవ్, ఏఐసీసీ సభ్యుడు కేటీ శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే సుధాకర్, మైనార్టీ నేత దాదాగాంధీ పాల్గొన్నారు.
‘మహాత్మాగాంధీ సందేశ పాదయాత్ర’లో రఘువీరా


