జిల్లాలో తరిగిన పశుసంపద
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో పశుసంపద తరిగిపోతోంది. పశువులు, ఎద్దుల సంఖ్య భారీగా తగ్గివడం ఆందోళన కలిగిస్తోంది. పశుసంవర్ధకశాఖ గతేడాది చేపట్టిన పశుగణన (సెన్సస్)లో మిశ్రమ గణాంకాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. 2025 పశుగణన ఫలితాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ‘సాక్షి’కి అందిన సమాచారం మేరకు.. గత 2012తో పాటు 2019 పశుగణనతో పోల్చితే పశువులు, ఎద్దుల సంఖ్య బాగా తగ్గిపోగా... అదే సందర్భంలో గొర్రెలు, మేకల సంపద, పౌల్ట్రీ పరిశ్రమ భారీగా పెరగడం గమనార్హం.
పశు సంపదకు ప్రోత్సాహమేదీ..?
వ్యవసాయంలో ట్రాక్టర్ల వినియోగం పెరగడంతో ఎద్దుల సేద్యం కనుమరుగవుతూ వస్తోంది. పశువుల ఎరువు తగ్గిపోవడం, పంటల్లో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం కూడా పెరిగిపోయింది. దేశీయ(నాటీ) పశువులు, గేదెల సంఖ్య గణనీయంగా తగ్గిపోగా... వాటి స్థానంలో పాడిపై ఆధారపడిన ప్రజలు సంకరజాతి, ముర్రా జాతి పశువులు, గేదెలు మాత్రమే పెంపకం చేస్తున్న పరిస్థితి నెలకొంది. యాంత్రీకరణ పెరగడంతో గడ్డి ఉత్పత్తి కూడా బాగా తగ్గిపోయింది. ఇక ప్రభుత్వం నుంచి దాణా, సైలేజ్, దాణామృతం (టీఎంఆర్) లాంటి వాటిని రాయితీతో పంపిణీ ఆపేసింది. అక్కడక్కడా కంటి తుడుపుగా దాణా ఇచ్చారు. ఖరీఫ్, రబీ, వర్షాకాలంలో గడ్డి పెంపకానికి ప్రోత్సాహం కరువైపోయింది. అలాగే పశుబీమా అమలు పడకేయడం, పాడికి సరైన గిట్టుబాటు ధరలు ఇవ్వకపోవడం వల్ల పాడి పోషణ భారంగా పరిణమిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రకృతి సేద్యం విస్తరించడంతో పాటు ప్రభుత్వం నుంచి పాడికి ప్రోత్సాహం లభిస్తేనే పశుసంపద మనుగడ సాధ్యమవుతుందని అంటున్నారు.
పెరిగిన జీవ సంపద..
ఇక జీవసంపద గణనీయంగా పెరిగింది. 2012లో 19.10 లక్షలు ఉండగా 2019 నాటికి 22.94 లక్షలకు చేరింది. ఇపుడు ఏకంగా 29 లక్షలకు చేరుకున్నట్లు సమాచారం. ఇందులో ఉరవకొండ డివిజన్‌లో ఏకంగా 38 శాతం పెరగ్గా.. అనంతపురం డివిజన్‌లో 14 శాతం పెరిగాయి. అలాగే మేకల విషయానికి వస్తే 2012లో 3.44 లక్షలు ఉండగా 2019 నాటికి 4.02 లక్షలకు చేరాయి. ఇపుడు 4.82 లక్షలకు పెరిగాయి. అందులో ఉరవకొండ డివిజన్‌లోనే 27 శాతం పెరగ్గా, అనంతపురం డివిజన్ పరిధిలో ఒక శాతం పెరిగినట్లు చెబుతున్నారు. పౌల్ట్రీ (కోళ్ల పెంపకం)లో కూడా 2012లో 8 లక్షల సంఖ్యలో ఉండగా 2019 నాటికి 10 లక్షలకు పెరగ్గా... ఇపుడు రెట్టింపు స్థాయిలో 21.54 లక్షలకు చేరుకుంది. ఇక్కడ కూడా ఉరవకొండ డివిజన్‌లోనే 120 శాతం పెరగ్గా, అనంతపురం డివిజన్‌లో 110 శాతం పెరిగినట్లు అంచనా వేశారు. ఇక పందులు, కుక్కలు సంఖ్య దాదాపు స్థిరంగా కొనసాగుతుండగా.. గాడిదలు, గుర్రాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి కనుమరుగయ్యే పరిస్థితి నెలకొన్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
2019 గణనతో పోల్చితే 10 నుంచి
12 శాతం తగ్గిన ఆవులు, గేదెలు
యాంత్రీకరణ, గడ్డి, దాణా కొరత, ప్రోత్సాహం లేక పాడి తగ్గుముఖం
జిల్లాలో తరిగిన పశుసంపద
జిల్లాలో తరిగిన పశుసంపద


