గుమ్మనూరు వన్‌మ్యాన్ షో
● ఆర్‌యూబీకి రెండోసారి భూమి పూజ
● ముఖం చాటేసిన రైల్వే అధికారులు
● ఎంపీ అంబికాకు అందని ఆహ్వానం
గుంతకల్లు: ఆయనకు అధికారులే కాదు ప్రజాప్రతినిధులన్నా గౌరవం లేదు. టీడీపీ అధిష్టానం మాటన్నా లెక్కలేదు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని సొంత సామ్రాజ్యంగా భావిస్తున్నారు. అందులో ఎవ్వరి జోక్యం ఉండరాదనుకుంటున్నారు. అందుకే అంతా తానై వ్యవహరిస్తూ వన్‌మ్యాన్ షో చేస్తున్నారు. ఇందుకు తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. శనివారం గుంతకల్లు పట్టణంలోని ధర్మవరం రైల్వే లెవల్ క్రాసింగ్ (ఎల్‌సీ) గేట్ వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ) పనులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం భూమి పూజ చేశారు. ఆయనతో పాటు మున్సిపల్ చైర్‌పర్సన్ భవాని, ఆర్డీఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్, తహసీల్దార్ రమాదేవి హాజరయ్యారు. దాదాపు రూ.10 కోట్ల విలువైన ఈ రైల్వే పనుల భూమి పూజకు ఏ ఒక్క రైల్వే అధికారి కూడా రాలేదు. రైల్వే పనుల భూమి పూజలో ప్రొటోకాల్ ప్రకారం అనంతపురం పార్లమెంట్ సభ్యుడు అంబికా లక్ష్మీనారాయణకు ఆహ్వానించాలి. కానీ ఎంపీకి ఆహ్వానమే అందలేదు.
మళ్లీ మళ్లీ భూమి పూజ
వాస్తవానికి ధర్మవరం రైల్వే ఎల్‌సీ గేట్ అండర్ బ్రిడ్జి పనులకు 2024 మార్చి 16న అప్పటి ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి, రైల్వే అధికారులు సీనియర్ డీఈఎన్ కోర్డినేషన్ అక్కిరెడ్డి, సీనియర్ డీఎఫ్‌ఎం ప్రదీప్‌బాబు ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఆనాడు వై.వెంకటరామిరెడ్డి చొరవతో ఈ ధర్మవరం లెవెల్ క్రాసింగ్ గేట్ (నం.157) వద్ద ఆర్‌యూబీ పనుల కోసం ప్రభుత్వం రూ.8.50 కోట్లు నిధులు మంజూరు చేసింది. టెండర్లు ప్రక్రియ కూడా ఆప్పుడే పూర్తిచేశారు. ఇక పనులు ప్రారంభించే సమయంలో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఆర్‌యూబీ పనులకు తాత్కాలిక బ్రేక్ పడింది. అయితే ఎప్పుడో నిధులు మంజూరై, టెండర్ల ప్రక్రియ పూర్తయి, భూమి పూజ కూడా జరిగిన ఈ పనులకు శనివారం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మళ్లీ భూమి పూజ చేయడం గమనార్హం.
ఎంపీని ఎందుకు దూరం పెట్టారు?..
భూమి పూజ కార్యక్రమానికి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు ఆహ్వానం అందలేదు. కావాలనే ఎంపీనీ దూరం పెట్టారని, ఆయన్ను అవమానించాలనే ఉద్దేశంతోనే ఆహ్వానం పంపలేదని సమాచారం. ఎంపీని ఈ విధంగా అవమానించడం వెనుకు గుమ్మనూరు సోదరుల ఆక్రోశం దాగి ఉంది. ఇటీవల ఓ రైల్వే కాంట్రాక్ట్ విషయంలో 10 శాతం వాటా కమీషన్‌గా చెల్లించే విషయంలో ఎంపీ అంబికాకు, ఎమ్మెల్యే గుమ్మనూరుకు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఎంపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి నుంచి ఎంపీపై గుమ్మనూరు రగిలిపోతున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న గుమ్మనూరు.. ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి ఎంపీని అవమానించారని తెలుస్తోంది.
రైల్వే అధికారుల డుమ్మా..
ఈ భూమి పూజ కార్యక్రమానికి రైల్వే అధికారులు హాజరు కాలేదు. పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని రైల్వే అధికార యంత్రాంగం బహిష్కరించింది. ఈ బహిష్కరణ వెనుక ఓ చిన్న కథ నడిచింది. తనకు ఆహ్వానం అందని విషయాన్ని తీవ్ర అవమానంగా భావించిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ నేరుగా రైల్వే ఉన్నతాధికారులకు ఫోన్ చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రొటోకాల్ నిబంధనల గురించి రైల్వే అధికారులకు ఎంపీ గుర్తు చేసినట్లు సమాచారం. ఎంపీకి అధికారులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఎమ్మెల్యే గుమ్మనూరు వన్‌మ్యాన్ షో తీరుతో అనవసరంగా మాట పడాల్సి వచ్చిందని రైల్వే ఉన్నతాధికారులు భావించారు. ఫలితంగా ఈ భూమి పూజకు డుమ్మా కొట్టి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
గుమ్మనూరు వన్‌మ్యాన్ షో


