నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం
అనంతపురం అర్బన్: జాతీయ ఓటర్ల దినోత్సవం ఆదివారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి జిల్లా ఎన్నికల అధికారి, ఇన్‌చార్జ్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ముందుగా భారత ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి ప్రసంగాన్ని వర్చువల్ విధానంలో తిలకిస్తారు. దినోత్సవం పురస్కరించుకుని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో ఉత్తమ సేవలు అందించిన 13 మంది ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేస్తారు. అలాగే యువ ఓటర్లకు ఓటర్ గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తారు. వయసు 80 ఏళ్లు పైబడిన ఓటర్లను సన్మానిస్తారు.
నేటి నుంచి కొండమీదరాయుని బ్రహ్మోత్సవాలు
బుక్కరాయసముద్రం: మండల కేంద్రం బుక్కరాయసముద్రంలో కొండమీదరాయస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. పది రోజులపాటు ఉత్సవాలు సాగుతాయి. ఆదివారం సాయంత్రం స్థానిక లక్ష్మీ నారాయణస్వామి దేవాలయంలో నుంచి స్వామి వారి ఉత్సవ విగ్రహాలను కొండపైకి తీసుకెళ్తారు. ఉదయం 8 గంటలకు దేవరకొండపై ఉత్సవ విగ్రహాలకు పుణ్యాహవచనం, అంకురార్పణ, దేవతా హోమాలు, ధ్వజారోహనం, గరుడ ఆహ్వాన పూజ నిర్వహిస్తారు. 26వ తేదీ రాత్రి 8 గంటలకు స్వామి వారికి పుష్ప పల్లకీ సేవ నిర్వహించనున్నారు. 27న రాత్రి సింహ వాహనం, 28న రాత్రి శేష వాహనం, 29న హనుమద్‌వాహనం, 30న రాత్రి గరుడ వాహనంపై ఊరేగిస్తారు. 31న రాత్రి శ్వేత గజ వాహనంపై ఊరేగిస్తారు.
1న శ్రీవారి కల్యాణోత్సవం, రథోత్సవం
ఫిబ్రవరి ఒకటో తేదీ వేకువ జామున నాలుగు గంటలకు మండల కేంద్రంలో స్వామి వారికి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఉదయం 11.30 గంటలకు సూర్యప్రభ వాహనంపై గరుడాద్రి బ్రాహ్మణ సంఘం ఆద్వర్యంలో లక్ష్మీ నారాయణస్వామి దేవాలయం నుంచి పురవీధుల్లో ఊరేగించనున్నారు. సాయంత్రం మండల కేంద్రంలో కనుల పండువగా రథోత్సవం నిర్వహిస్తారు. రెండో తేదీ రాత్రి 8 గంటలకు స్వామి వారిని అశ్వవాహనం, 3న రాత్రి హంస వాహనంపై ఊరేగిస్తారు. ఈ తిరుణాలలో భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.
గురుకులాల్లో ఖాళీ సీట్లకు దరఖాస్తు చేసుకోండి
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని సాంఘిక సక్షేమ (డాక్టర్ బీఆర్ అండేడ్కర్) గురుకులాల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంతో పాటు, 6–9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి జిల్లా సమన్వయ అధికారి కె.విజయలక్ష్మి కోరారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 19లోగా రూ. 100 రుసుంతో వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఎస్సీ గ్రూప్–1కు 5 శాతం, ఎస్సీ గ్రూప్–2కు 32.5 శాతం, ఎస్సీ గ్రూప్–3కు 37.5 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీ–సీలకు 11 శాతం, బీసీలకు 5 శాతం, ఓసీలకు 3 శాతం ప్రకారం సీట్లు రాష్ట్ర కార్యాలయ అధికారులు కేటాయిస్తారని స్పష్టం చేశారు.
నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం
నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం


