ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిద్దాం
అనంతపురం: చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా ప్రశ్నిద్దామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, అనంతపురం అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్త అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నూతనంగా నియమించిన క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు, పరిశీలకులు, సచివాలయాల ఇన్‌చార్జ్‌లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. పార్టీ, అనుబంధ విభాగాల కమిటీలను ఫిబ్రవరి 10లోగా పూర్తి చేయాలని కోరారు. 85 సచివాలయాలకు గాను సచివాలయాల వారీగా వైఎస్సార్‌సీపీ కమిటీలతో పాటు అనుబంధ యువజన, విద్యార్థి, మహిళ, మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ట్రేడ్ యూనియన్, సోషల్ మీడియా కమిటీలను గడువులోగా నియమించాలని తెలియజేశారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసేవాళ్లను గుర్తించి కమిటీల్లోకి తీసుకోవాలని సూచించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందజేశామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ప్రచార ఆర్భాటానికి మాత్రమే పరిమితమైందని మండిపడ్డారు. 19 నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు.


