27 నుంచి ఏపీపీఎస్‌సీ పరీక్షలు
అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) ఆధ్వర్యంలో 17 కేటగిరీలకు సంబంధించిన పోస్టుల భర్తీకి ఈ నెల 27 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి. నిర్వహణ ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని డీఆర్‌ఓ మలోల అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై డీఆర్‌ఓ శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏపీపీఎస్‌సీ అసిస్టెంట్ సెక్రెటరీ ప్రశాంత్‌కుమార్, సెక్షన్ ఆఫీసర్ మల్లికార్జునరెడ్డితో కలిసి అధికారులతో సమీక్షించారు. 27 నుంచి 28 వరకు రెండు సెషన్లుగా ఉదయం, మధ్యాహనం పరీక్ష ఉంటుందన్నారు. 29, 30, 31 తేదీల్లో ఉదయం మాత్రమే జరుగుతుందన్నారు. నాలుగు కేంద్రాల్లో జరగనున్న పరీక్షలకు 27న ఉదయం 1,533 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం 36 మంది, 28న ఉదయం 99 మంది, మధ్యాహ్నం 623 మంది, 29 ఉదయం 251 మంది, 30 ఉదయం 873 మంది, 31వ తేదీ ఉదయం 251 మంది అభ్యర్థులు హాజరవుతారని తెలిపారు. సమావేశంలో కలెక్టరేట్ ఏఓ అలెగ్జాండర్, వివిధ అధికారులు పాల్గొన్నారు.
గణతంత్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
గణతంత్ర దినోత్సవ వేడుక కన్నుల పండుగలా నిర్వహించాలని, ఇందుకోసం ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. వేడుకల నిర్వహణకు పోలీసు పరేడ్ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను ఇన్‌చార్జ్ కలెక్టర్ శనివారం రాత్రి అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్‌ఓ మలోలతో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఏర్పాట్లకు సంబంధించి అప్పగించిన బాధ్యతలను ఆయా అధికారులు పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణ, ఫ్లాగ్ ఏర్పాటు, కవాతు ప్రాంత అలంకరణ, విద్యుత్ సరఫరా, స్టాళ్లు, శకటాలు, సిట్టింగ్, మౌలిక సదుపాయాలు తదితర ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా చూసుకోవాలన్నారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


