కొనుగోలుమాల్
రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం కురుగుంటతో పాటు చియ్యేడులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండుచోట్ల ప్రైవేట్ వ్యక్తులే రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. వీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. వీరికి కందులు కొనుగోళ్లు పెద్ద వ్యాపారంగా మారింది. తూకాల్లోనూ, నాణ్యతలోనూ, హమాలీ చార్జీల వసూళ్లలోనూ వీరు ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతుంటే ప్రభుత్వం క్వింటాకు రూ. 8 వేలుతో కొనుగోలు చేస్తుందంటే అంత ఆశపడ్డారు. అయితే అధికార పార్టీ కార్యకర్తలకు కొనుగోలు బాధ్యతలు అప్పగించి రైతుల నడ్డి విరుస్తున్నారు. ఇదిలాఉండగా బాధిత రైతుల్లో కరుడుగడ్డిన టీడీపీ కార్యకర్తలూ ఉన్నారు. ఎవరినీ వదలడం లేదంటూ వారు గగ్గోలు పెడుతున్నారు.
గతేడాది రూ. 60 మాత్రమే వసూలు
గతేడాది సొసైటీల ద్వారా కందులు కొనుగులు చేశారు. అప్పుడు హమాలీల చార్జీలు క్వింటాకు రూ. 60 మాత్రమే వసూలు చేశారు. ఈ మొత్తం హామీల కష్టానికి పూర్తి స్థాయిలో సరిపోతుందని అధికారులు చెప్తున్నారు. మరి ఈసారి ప్రైవేట్ వ్యుక్తలు మాత్రం క్వింటాకు రూ. 150 వసూలు చేస్తున్నారు. అంటే ఒక క్వింటాకు రూ. 90 అదనం. ఈసారి కంది దిగుబడి ఆశాజనకంగా ఉంది. ఒక్క అనంతపురం రూరల్ మండలంలోనే దాదాపు 10 క్వింటాళ్ల దాకా అమ్మకాలు జరుగుతుయాని అంచనా. అదే జరిగితే ఒక్క హమాలీల చార్జీల్లోనూ అక్షరాలా రూ. 9 లక్షల దాకా దోపిడీ చేస్తున్నారు. నాణ్యత లేదని, తేమశాతం, ఇతర సాకులతో ఒక్కో బ్యాగుకు 51.250 కిలోలు పట్టాల్సి ఉన్నా...51.500 కిలోల నుంచి 52.500 కిలోల దాకా పడుతున్నారు. ఏమి మాట్లాడినా నాణ్యత లేవని, ఇవి పట్టమని చెప్తూ బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. వాస్తవానికి గతేడాది కాస్తా పుచ్చులు ఉన్నా ప్రభుత్వం కొనుగోలు చేసిందని, ఇప్పుడు తీసుకుంటున్నా కొనుగోలు దారులకు మరింత చేతులు తడిపితే ఇవేవీ పట్టించుకోరని రైతులు ఆవేదన చెందుతున్నారు.
అధికారులకు అన్నీ తెలుసు..
ప్రైవేట్ వ్యక్తులు సాగిస్తున్న దోపిడీ సంబంధిత మార్కెట్‌ఫెడ్ అధికారులకు అన్నీ తెలుసు. ధైర్యంగా ప్రశ్నించలేకపోతున్నారు. కొనుగోలు చేస్తున్న వారికి అధికార పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధుల అండ ఉండడంతో ఏమీ మాట్లాడలేకపోతున్నారు. కళ్లెదుటే రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వారు గుర్తించినా మాట మాట్లాడలేకపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కందుల కొనుగోల్లో సాగిస్తున్న దోపిడీని నిలువరించాలని రైతులు వేడుకుంటున్నారు.
రైతుల నుంచి కంది కొనుగోలు కేంద్రం ప్రతినిధుల దోపిడీ
టీడీపీ కార్యకర్తలే కొనుగోలు కేంద్రాల ప్రతినిధులు
హమాలీల పేరుతో క్వింటాకు రూ.150 వసూలు
క్వింటాకు కేజీ నుంచి 3 కేజీల దాకా దోపిడీ
లబోదిబోమంటున్న రైతులు... పట్టించుకోని అధికారులు
అనంతపురం రూరల్ మండలం కామారుపల్లికి చెందిన మహిళా రైతు అవిలిగొండ మనెమ్మ ఆరు ఎకరాల్లో కందిసాగు చేయగా, మొత్తం 42 బ్యాగుల (21 టన్నులు) దిగుబడి వచ్చింది. ఇటీవల కురుగుంట సమీపంలోని చంద్రప్రియనగర్‌లోని గోడౌన్‌లో విక్రయించింది. శనివారం ఆమె మొబైల్‌కు 10 బ్యాగులు (ఐదు టన్నులు) తిరస్కరించినట్లు మెసేజ్ వచ్చింది.
అదే గ్రామానికి చెందిన భోగే పార్వతి తన 12.53 ఎకరాల్లో 29 క్వింటాళ్ల కంది దిగుబడి వచ్చింది. కురుగుంట గోడౌన్‌లో విక్రయించింది. ఈమెకు 5 క్వింటాళ్లు తిరస్కరించినట్లు మెసేజ్ పంపారు.
అనంతపురం రూరల్ మండలం గొల్లపల్లికి చెందిన రైతు మలిరెడ్డి 40 క్వింటాళ్లు విక్రయించాడు. హమాలీలకు క్వింటాకు రూ.150 చొప్పున రూ. 6 వేలు ఇవ్వాలని అడిగారు. ఇదేమని ప్రశ్నించగా రూ. 6 వేలు చెల్లించాల్సిందేనని చెప్పడంతో నిస్సహాయస్థితిలో ఉండిపోయాడు. కందుల మాటున సాగుతున్న దోపిడీకి ఈ ఉదంతాలే నిదర్శనం.


