యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టులు పూర్తి చేయాలి
● విభజన హామీలు తక్షణమే అమలు చేయాలి
● ప్రాంతీయ సదస్సులో వక్తలు
కడప సెవెన్‌రోడ్స్ : రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు మెట్ట ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించే పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు రానున్న బడ్జెట్‌లో అఽధిక ప్రాధాన్యత ఇవ్వాలని వివిధ పార్టీలు, సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఏపీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి.నారాయణరెడ్డి అధ్యక్షతన కడపలోని బీసీ భవన్‌లో ప్రాంతీయ సదస్సు నిర్వహించారు.
అభివృద్ధిని వికేంద్రీకరించాలి..
సీఈఎస్‌ఎస్ ప్రొఫెసర్ సి.రామచంద్రయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు అభివృద్ధిలోనూ వెనకబడ్డాయని, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. వ్యవసాయం, దాని ఆధారిత పరిశ్రమలు అభివృద్ధి చేయాలన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అమరావతిపైనే దృష్టి కేంద్రీకరిస్తోందన్నారు. 2వేల ఎకరాల్లో రాజధాని నిర్మించొచ్చని, మూడు పంటలు పండే జరి భూములను సేకరించడం సరికాదన్నారు. రాజధాని కోసం అప్పు చేసి లక్షల కోట్లు ఖర్చుచేస్తామంటున్న ప్రభుత్వం.. అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు రూ. కోటి మంజూరు చేయడం లేదని విమర్శించారు.
బాబూ ఇదేం సంపద సృష్టి..
సంపద సృష్టిస్తామని అధికారంలోకొచ్చిన చంద్రబాబునాయుడు అమరావతి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తే సంపద సృష్టి జరుగుతుందా? అని మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ ప్రశ్నించారు. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం క్విడ్ ప్రోకోకు ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. సోషల్ మీడియాలో ఎవరైనా మాట్లాడితే సమాధానం చెప్పలేక కేసులు బనాయించడం అన్యాయమన్నారు. వీటిపై మంత్రులతో సబ్ కమిటీలు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ప్రాజెక్టులు, పరిశ్రమలపై ఎందుకు సబ్ కమిటీలు ఏర్పాటు చేయదని ప్రశ్నించారు. విభజన హామీలు అమలు కావడం లేదన్నారు. సొంత మీడియాలో విజన్–2047 అంటూ ప్రచారం తప్ప చేసిన అభివృద్ధి ఏమీలేదన్నారు.
సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి
సదస్సుకు అధ్యక్షత వహించిన నారాయణరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం మెట్ట ప్రాంతాలకు ఉపయోగపడే సాగునీటి ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే 194 మెట్ట ప్రాంత మండలాలలో 23 లక్షల ఎకరాలకు సాగునీరు, రెండున్నర కోట్ల మందికి తాగునీరు అందుతుందన్నారు. కడప స్టీల్ ప్లాంటు, కడప–బెంగుళూరు రైల్వేలైన్, ఇతర విభజన హామీల అమలు కోసం పోరాడతామని తెలిపారు. పలువురు వక్తలు మాట్లాడారు. కార్యక్రమంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్దివేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యాం ప్రసాద్, ఉపాధ్యక్షులు వైవీ శివయ్య, అనంతపురం జిల్లా అధ్యక్షులు జి.నారాయణరెడ్డి, కేవీ రమణ, వైఎస్సార్ సీపీ నాయకుడు బూసిపాటి కిశోర్‌కుమార్, ఏఐఎస్‌బీ జాతీయ కన్వీనర్ జయవర్దన్, పీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరాయుడు, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఓబయ్య, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు గుర్రప్ప, పీఆర్‌ఎస్‌వైఎఫ్ రాష్ట్ర కన్వీనర్ కె.శంకర్, కాంగ్రెస్ నాయకులు సత్తార్ పాల్గొన్నారు.


