అమిలినేని అనుచరుడి దౌర్జన్యం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరుడు అధికార దాహంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇంటి నిర్మాణాలను దౌర్జన్యంగా కూల్చివేశాడు. ఈ ఘటన కళ్యాణదుర్గం మండలం కదరంపల్లిలో రెండు రోజుల క్రితం చోటు చేసుకుంది. ఈ విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. కదరంపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త నాగలక్ష్మి దంపతులు గ్రామంలో ఇల్లు, ప్రహరీ, మరుగుదొడ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. అయితే నాగలక్ష్మి ఇంటికి ఆనుకొని టీడీపీ నేత వెంకటేశులు (ఎమ్మెల్యే అమిలినేనికి ముఖ్య అనుచరుడు) ఇంటిని కొన్నేళ్ల క్రితం నిర్మించుకున్నాడు. అధికారమదంతో సదరు టీడీపీ నేత ఎమ్మెల్యే పేరు చెప్పుకొని నాగలక్ష్మి నిర్మించుకున్న ప్రహరీ, మరుగుదొడ్డిని తొలగించాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులు పలుమార్లు కాంపౌండ్ వాల్, మరుగుదొడ్డిని తొలగించాలని నాగలక్ష్మికి సూచించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదేశాలతో ఆమెకు నోటీసులు అందించారు. నోటీసులు అందుకోకపోవడంతో పోలీసులతో భయపెట్టిన టీడీపీ నేత .. శుక్రవారం సాయంత్రం నాగలక్ష్మి దంపతులను స్టేషన్‌కు రావాలని పోలీసులతో ఒత్తిడి చేయించారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో నాగలక్ష్మి నిర్మించుకున్న ప్రహరీ, మరుగుదొడ్డిని దౌర్జన్యంగా జేసీబీతో తొలగింపజేశారు. ఇదంతా టీడీపీ నేత వెంకటేశులు తన ఇంటికి దారి ఏర్పాటు చేసుకునేందుకే వైఎస్సార్‌సీపీ కార్యకర్త నిర్మాణాలను కూల్చివేశాడని గ్రామస్తులు అంటున్నారు. ఎమ్మెల్యే అండతోనే ఇలా దౌర్జన్యం చేస్తున్నారని బాధితులు అంటున్నారు. అయితే ప్రభుత్వ స్థలంలో నిర్మించినందుకే తొలగించారని పోలీసులు నాగలక్ష్మి దంపతులను స్టేషన్‌కు పిలిపించి విచారించడం కొసమెరుపు.


