గెలుపు దిశగా ఆంధ్ర
● రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు కుప్పకూలిన విదర్భ
● ఆంధ్ర లక్ష్యం 259..ప్రస్తుతం 93/1
అనంతపురం కార్పొరేషన్: ఆంధ్రజట్టు గెలుపు దిశగా పరుగులు పెడుతోంది. ఆంధ్ర బౌలర్లు సమష్టిగా రాణించడం..రెండో ఇన్నింగ్స్‌లో విదర్భ జట్టును తక్కువ స్కోర్‌కే పరిమితం చేయడంతో పాటు ఆంధ్ర జట్టు ఆటముగిసే సమయానికి 93/1 పరుగులతో గెలుపు దిశగా ముందుకుసాగుతోంది.
కుప్పకూలిన విదర్భ: అనంతపురం క్రికెట్ గ్రౌండ్‌లో మూడో రోజు జరిగిన మ్యాచ్‌లో విదర్భ జట్టు ఓవర్‌నైట్ స్కోర్ 4/0తో ప్రారంభించింది. విదర్భ జట్టును ఆంధ్ర బౌలర్లు కట్టిడి చేసి కేవలం 191 పరుగులకు పరిమితం చేశారు. ఆంధ్ర బౌలర్ సాయితేజ నాలుగు వికెట్లు తీసుకొని విదర్భను కోలుకోలేని దెబ్బతీశాడు. సాయితేజకు తోడుగా సౌరబ్‌కుమార్ 2, నితీష్‌కుమార్ రెడ్డి 2, విజయ్, కేఎస్‌ఎన్ రాజు చెరో వికెట్ తీసి విదర్భ పతనాన్ని శాసించారు. విదర్భ జట్టులో వైవీ రాథోడ్ 56 (7ఫోర్లు, సిక్సర్), ఆర్. సమర్థ్ 47(4పోర్లు) రాణించగా, మిగితా బ్యాట్స్‌మెన్‌లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. 259 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆంధ్ర జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆటముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 93 పరుగులు చేసింది. జట్టులో వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ 27 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఆటకు ఆదివారం చివరి రోజు. ఇదిలా ఉండగా ఆంధ్ర, విదర్భ మ్యాచ్‌ను భారత జట్టు సెలెక్టర్ ప్రజ్ఞ్యాన్ ఓజా తిలకించారు.


