ఆంధ్ర తడబాటు.. ఆధిక్యంలో విదర్భ
● 228 పరుగులకు ఆలౌట్
● 67 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో విదర్భ
అనంతపురం కార్పొరేషన్: రంజీ మ్యాచ్‌లో భాగంగా అనంతపురం క్రికెట్ గ్రౌండ్‌లో శుక్రవారం రెండో రోజు విదర్భ బౌలర్ల ధాటికి ఆంధ్ర జట్టు తడబడింది. జట్టులో అభిషేక్ రెడ్డి, సౌరభ్‌కుమార్ అర్ధసెంచరీలు చేయగా, నితీష్‌కుమార్ రెడ్డి పర్వాలేదనిపించాడు. ఇక మిగిలిన బ్యాటర్లు ఎవరూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్ర క్రికెట్ జట్టు 228 పరుగులకు కుప్పకూలింది. 267/7తో ఓవర్‌నైట్ స్కోర్‌తో విదర్భ జట్టు రెండో రోజు ఆట కొనసాగించిన కాసేపటికే సౌరభ్‌కుమార్ బౌలింగ్‌లో జి.నల్కేండే అవుటయ్యాడు. అనంతరం సెంచరీ హీరో వైవీ రాథోడ్ 115 పరుగులు చేసి సాయితేజ బౌలింగ్‌లో కీపర్ కేఎస్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 89.3 ఓవర్ల వద్ద 295 పరుగులకు విదర్భ జట్టు ఆలౌట్ అయింది. ఆంధ్ర బౌలర్లలో కేఎస్ రాజు 5, కె.సాయితేజ 3, సౌరభ్‌కుమార్, నితీష్‌కుమార్ రెడ్డి చెరో వికెట్ తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఆంధ్ర జట్టు 23 పరుగుల వద్ద కేఎస్ భరత్ (9) అవుటయ్యాడు. అనంతరం ఎస్‌కే రషీద్, కెప్టెన్ రికీ భుయ్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ దారి పట్టారు. ఈ క్రమంలో ఓపెనర్ అభిషేక్‌రెడ్డితో నితీష్‌కుమార్‌రెడ్డి జత కట్టాడు. కీలక దశలో అభిషేక్‌రెడ్డి (73)ని ఏఎస్ థాకరే అవుట్ చేశాడు. ఈ సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన సౌరభ్‌కుమార్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అవకాశం దొరికినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ 87 బంతుల్లో 62 పరుగులు చేసి అవుటయ్యాడు. నితీష్‌కుమార్ రెడ్డి 35, త్రిపురణ విజయ్ 17 పరుగులు చేశారు. దీంతో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 228 పరుగులకు ఆలౌట్ కాగా విదర్భకు 67 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది. విదర్భ బౌలర్లలో నల్కండే, థాకరే, భూతే, పీఆర్ రేఖడే చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం విదర్భ జట్టు ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 4 పరుగులు చేసింది.
మ్యాచ్‌ను తిలకించిన
ఇండియన్ సెలెక్టర్ ఓజా
భారత జట్టు సెలెక్టర్ (సౌత్‌జోన్) ప్రజ్ఞాన్ ఓజా శుక్రవారం అనంతపురం క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర, విదర్భ జట్ల మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్‌ను తిలకించారు. ఆయన వెంట ఏసీఏ సెలెక్షన్ ఛైర్మన్ ఆర్‌వీసీహెచ్ ప్రసాద్, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛోఫెర్రర్ తదితరులు ఉన్నారు.


