కూడేరు: భూ రీసర్వే ప్రక్రియలో ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని సంబంధిత సిబ్బందిని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మలోల ఆదేశించారు. కూడేరు మండలం గొటుకూరులో కొనసాగుతున్న రీసర్వే ప్రక్రియను శుక్రవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి, సిబ్బందితో మాట్లాడారు. రైతుల సమక్షంలోనే వారి భాగస్వామ్యంతో హద్దులు నిర్ధారణ చేయాలన్నారు. గ్రామ సభలు నిర్వహించి సర్వే నిబంధనలు, రికార్డులోని భూ విస్తీర్ణాన్ని చదివి వినిపించి రైతుల అంగీకారం మేరకే ఖరారు చేయాలని ఆదేశించారు. ఏకపక్షంగా వ్యవహరించి తప్పిదాలకు చోటిస్తే బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు.కార్యక్రమంలో తహసీల్దార్ మహబూబ్ బాషా, మండల సర్వేయర్లు ప్రసాద్, అయేషా సిద్ధిఖీ, వీఆర్వో కుళ్లాయిస్వామి పాల్గొన్నారు.
యూరియా కలిపిన నీరు తాగి..
రాప్తాడు రూరల్: ప్రమాదవశాత్తు విషపూరిత నీరు తాగడంతో 39 పొట్టేళ్లు మృతి చెందాయి. వివరాల్లోకి వెళితే.. రాప్తాడుకు చెందిన బుల్లే గంగాధర్ స్థానిక 44వ జాతీయ రహదారి సమీపంలో తన తోటలో షెడ్డు ఏర్పాటు చేసి 68 పొట్టేళ్లను పెంచుతున్నాడు. సాగు చేసిన మొక్కజొన్న పంటకు శుక్రవారం ఉదయం యూరియా కలిపిన నీటిని డ్రిప్ ద్వారా వదిలాడు. విద్యుత్ సరఫరాలో అంతరాయం చోటు చేసుకోవడంతో పైపులో యూరియా నిలిచిపోయింది. ఈ విషయం తెలియని గంగాధర్ పైప్‌లను తీసి నీటి తొట్టెలో వేశాడు. కాసేపటి తర్వాత కరెంట్ రావడంతో మోటార్ ఆన్ చేయగానే పైపుల్లో ఉన్న యూరియా తొట్టెలోకి చేరుకుంది. పొట్టేళ్లను నీరు తాగేందుకు వదిలి గంగాధర్ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యాడు. కాసేపటి తర్వాత తొట్టె వద్దకు రాగా... చూస్తుండగానే 38 పొట్టేళ్లు చనిపోయాయి. వెంటనే విషయాన్ని పశుసంవర్ధక శాఖ ఏడీ ప్రకాష్ దృష్టికి తీసుకెళ్లడంతో సిబ్బందితో కలసి అక్కడకు చేరుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న 29 పొట్టేళ్లను కాపాడారు. మరొకటి మృతి చెందింది. ఘటనతో రూ.4.50 లక్షలు నష్టం వాటిల్లిందని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు.


