గెలుపే లక్ష్యంగా శ్రమిద్ధాం
● వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి
ఉరవకొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేద్దామంటూ నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ పీఏసీ సభ్యుడు, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై. విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణంపై ఉరవకొండ పట్టణానికి చెందిన పార్టీ ముఖ్యనేతలు, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులతో శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశమై మాట్లాడారు. నియోజకవర్గంలోని 86 పంచాయతీలు 108 గ్రామాలకు గాను ఇప్పటికే 80 శాతం కమిటీల నిర్మాణం పూర్తయిందన్నారు. ప్రతి మండలానికి 18 అనుబంధ విభాగాల కమిటీలను 198 మందితో పూర్తి చేసినట్లు వివరించారు. కమిటీలను ప్రతి స్థాయిలో డిజిటలైజేషన్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. నియోజకవర్గ నాయకులను సమన్వయం చేసుకుంటూ చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్య పరచాలని మండల, గ్రామ కమిటీల సభ్యులకు సూచించారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, రాష్ట్రంలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు పాలనపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. పాలన చేత కాక సీఎం స్థాయిలో చంద్రబాబు నిస్సుగ్గుగా అబద్ధాలు చెబుతూ ప్రజలను వంచిస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, నియోజకవర్గ డిజిటల్ మేనేజర్ మఠం వీరేష్, రాష్ట్ర నాయకులు యోగేంద్రరెడ్డి, బసవరాజు, వైస్ ఎంపీపీ, పట్టణ కన్వీనర్ ఈడిగప్రసాద్, మండల సమన్వయకర్త ఓబన్న పాల్గొన్నారు.


