సార్ ప్లీజ్.. ఒక్కరోజు ఆగండి
ఉరవకొండ: ‘సార్ ప్లీజ్ ఒక్కరోజు టైం ఇవ్వండి.. నేను వెళ్లి ‘అన్న’తో కలిసి వారు ఏం చెబితే అదే చేస్తా’ అంటూ జిల్లా దేవదాయ శాఖ సహాయ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్‌ను గవిమఠం ఇన్‌చార్జ్ ఏసీ రాణి ప్రాధేయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఏసీ గంజి మల్లికార్జున ప్రసాద్‌కు ఉరవకొండ గవిమఠం ఇన్‌చార్జ్ ఏసీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ, ధర్మదాయ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బాధ్యతలు తీసుకునేందుకు శుక్రవారం ఆయన గవిమఠంలోని ఏసీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు రాణి నిరాకరించారు. తనకు ఒక్క రోజు సమయమివ్వాలని, తన బాధ్యతలు కొనసాగించేలా అన్నతో సిఫారసు చేయించుకుని వస్తానని పేర్కొనడం చర్చానీయాంశమైంది. ఆమె తీరుతో కంగుతిన్న మల్లికార్జున సైతం తాను ఇక్కడకు రాకముందే అన్నీ చూసుకోవాలని, ఉత్తర్వులు వచ్చిన తర్వాత తననేమీ చేయమంటారు అంటూ ప్రశ్నించారు. దీంతో ప్టీజ్ సార్.. ప్లీజ్ అంటూ రాణి ప్రాధేయపడడంతో మల్లికార్జున అక్కడి నుంచి వెనుతిరిగారు.


