అనంతపురం అర్బన్‌లో అరాచకపర్వంపై పత్రికల్లో కథనాలు వచ్చి
● అపార్ట్‌మెంట్ బిల్డర్ నుంచి రూ.30 లక్షల డిమాండ్
● లేఅవుట్ చెరిపేసి ముస్లిం సోదరుల నుంచి డబ్బుల కోసం ఒత్తిడి
● టీటీడీ కల్యాణమంటపం, శిల్పారామం నిర్వాహకుడికి బెదిరింపు
● నిర్వాహకుడు లొంగలేదని సీఐని ఉసిగొలిపిన వైనం
● ‘దండుపాళ్యం’ బ్యాచ్ ఆగడాలపై అధిష్టానం, ప్రభుత్వానికి ఫిర్యాదుల వెల్లువ
● అనంతపురంలో అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు!
● అందులో భాగంగానే పోలీసుల అదుపులో ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు గంగారామ్
సాక్షిప్రతినిధి అనంతపురం: తరచూ వివాదాలతో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వార్తల్లోకెక్కుతున్నారు. ప్రజాసేవకుడిగా కాకుండా ప్రజలను పీడించుకుతినే వ్యక్తిగా ముద్ర వేసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా రుద్రంపేట పరిధిలోని పిస్తా హౌస్ సమీపాన ఓ అపార్ట్‌మెంట్ నిర్మిస్తున్న బిల్డర్‌ను రూ.30 లక్షలు డిమాండ్ చేశారు. మొదట మధ్యవర్తిగా వీఆర్‌ఓ వెళ్లి మాట్లాడారు. అంత పెద్ద మొత్తం ఇవ్వడానికి ఒప్పుకోని బిల్డర్.. టీడీపీలో ఉన్న తన మేనల్లుడి ద్వారా రూ.15 లక్షలు ఇచ్చారు. అలాగే రాజీవ్ కాలనీలో ఇద్దరు ముస్లిం మైనార్టీలు తమకున్న రెండెకరాల్లో వెంచర్ వేసుకున్నారు. రోడ్లు వేసి, సరిహద్దు రాళ్లు కూడా ఏర్పాటు చేశారు. వీరిని పిలిపించి డబ్బులు డిమాండ్ చేశారు. తాము రియల్టర్లం కాదని, తమ ఆస్తిని వెంచర్ వేసుకుని విక్రయిస్తున్నామని చెబితే రాళ్లను పూర్తిగా చెరిపేశారు. ఎమ్మెల్యేను కలిసి మాట్లాడుకోవాలని అధికారులు చెప్పారు. ఈ దందాలకు పూర్తిగా అధికారులే సహకరిస్తున్నారు. మధ్యవర్తులుగా వీఆర్‌ఓలు, రెవెన్యూ అధికారులే వెళ్లి ‘ఎమ్మెల్యేతో మాట్లాడాలని’ చెబుతున్నారంటే వ్యవస్థలు ఎంత దారుణంగా ఉన్నాయో స్పష్టమవుతోంది.
ఫెడ్‌కాన్ సుధాకర్‌రెడ్డికి బెదిరింపులు!
నగరంలోని టీటీడీ కల్యాణమంటపం, శిల్పారామం నిర్వహణ కాంట్రాక్టును టెండర్ ద్వారా ‘ఫెడ్‌కాన్’ యజమాని, బీజేపీ నేత సుధాకర్‌రెడ్డి దక్కించుకున్నారు. ఈయన్ను పిలిపించి ఎమ్మెల్యే రూ.30 లక్షలు డిమాండ్ చేశారు. చివరకు రూ.20 లక్షలు ఇవ్వాలని అడిగారు. దీంతో టీటీడీ కల్యాణమంటపం, శిల్పారామానికి రూ.1.50 కోట్లు ఖర్చు చేశానని, ఆ డబ్బులు తనకు ఇచ్చేసి నిర్వహణ బాధ్యత మీరే తీసుకోండని సుధాకర్‌రెడ్డి చెబితే.. ‘అవన్నీ కుదరవు.. డబ్బులు ఇవ్వాలం’టూ ఎమ్మెల్యే హుకుం జారీ చేశారు. ఇందుకు సుధాకర్‌రెడ్డి ససేమిరా అన్నారు. దీంతో ఓ సీఐ ద్వారా సుధాకర్‌రెడ్డిని బెదిరించి ఒప్పించే ప్రయత్నం చేశారు. దీంతో రెండిటినీ మూసేసి, ‘రాజకీయ నేతల ఒత్తిళ్లతో మూసేస్తున్నాను’ అని బ్యానర్ కట్టేస్తానని సుధాకర్‌రెడ్డి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారంలో డబ్బులు ఇంకా చేతులు మారలేదు.
ప్రశాంత ‘అనంత’లో అలజడి
రాయలసీమలో అత్యంత ప్రశాంత జీవనం గడిపే నగరం అనంతపురం. కడప, కర్నూలు, నెల్లూరు, గుంటూరు నుంచి వందలాది కుటుంబాలు ఉద్యోగాల నిమిత్తం ఇక్కడకు వచ్చి స్థిరపడ్డాయి. వ్యాపారులు, ఇతర వర్గాల వారిని బెదిరించడం, అలజడి సృష్టించడం, అందులో పోలీసులు, అధికారులు పావులుగా మారడం ‘అనంత’లో గతంలో ఎప్పుడూ లేదు. తొలిసారి వీఆర్‌ఓల నుంచి పోలీసులు, నగరపాలక సంస్థ అధికారులు, ఇతర వర్గాలు పూర్తిగా ఎమ్మెల్యే దందాలకు సహకరిస్తూ అలజడిలో భాగం అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. టౌన్‌ప్లానింగ్‌లో ఓ అధికారిణి పూర్తిగా ఎమ్మెల్యే అండతో పెత్తనం చెలాయిస్తున్నారు. ఎక్కడ ఏ నిర్మాణం జరిగినా ఎమ్మెల్యే ఆదేశాలు లేనిదే అనుమతి ఇవ్వడం లేదు. ‘ఎమ్మెల్యేను కలిసి రావాల’ని చెబుతున్నారు. చిన్న ఇల్లు నిర్మించినా కప్పం కట్టాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది.
ఆగడాలపై ఫిర్యాదుల వెల్లువ
ఎమ్మెల్యే దగ్గుపాటి, ఆయన వర్గీయుల ఆగడాలపై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై అనంతపురం టీడీపీ ఇన్‌చార్జ్ కోవెలమూడి రవీంద్ర (నాని), పార్టీ ఆఫీసు ఇన్‌చార్జ్ సునీల్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. టీడీపీ నేత ప్రభాకర్ చౌదరి, మరికొంతమంది ఇక్కడ విషయాలను అధిష్టానానికి చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. అరాచకాల కారణంగా శాంతిభద్రతలు అదుపు తప్పడంతో ఇంటెలిజెన్స్ డీజీ మహేశ్‌చంద్ర లడ్హా కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆగడాలకు అడ్డుకట్ట వేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ జగదీశ్‌కు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. అలాగే కార్పొరేషన్, ఇతర శాఖల అధికారులు కూడా దందాలకు సహకరించకుండా చూడాలని కలెక్టర్‌కు ఆదేశాలు అందినట్లు తెలిసింది. ఎమ్మెల్యేకు పూర్తిగా తొత్తులుగా మారి, దందాలకు సహకరించిన వారి జాబితాను కూడా కలెక్టర్ తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. వీరిపై కూడా బదిలీవేటు పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.


