మహిళలపై వీధి కుక్కల దాడి
ఉరవకొండ: మేజర్ గ్రామపంచాయతీ ఉరవకొండలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గడిచిన వారం రోజుల్లో 30 మంది పిల్లలు, మహిళలపై దాడులు చేశాయి. తాజాగా శుక్రవారం సత్యనారాయణపేట, చెంగలవీధిలో నలుగురు మహిళలలను కరిచి గాయపరిచాయి. అంతటితో ఆగక ఆడుకుంటున్న చిన్నారులపైకి దూసుకెళ్తుండటంతో కాలనీ వాసులు వాటిని తరిమికొట్టారు. అనంతరం ఆయా కాలనీవాసులు మూకుమ్మడిగా పంచాయతీ కార్యాలయానికి చేరుకుని కుక్కలబారి నుంచి తమను రక్షించాలని ఈఓ మహ్మద్‌రఫీ వద్ద మొరపెట్టుకున్నారు. ఈఓ స్పందిస్తూ కుక్కలను పట్టుకుని దూరంగా వదులుతామని చెప్పారు.
రీ సర్వేకు రైతులు
సహకరించాలి
● ఇన్‌చార్జ్ కలెక్టర్ సి.విష్ణుచరణ్
గుత్తి రూరల్: ఏపీ రీసర్వే పథకం కింద గ్రామాల్లో చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు రైతులు సహకరించాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ కోరారు. మండలంలోని ఊబిచెర్ల గ్రామంలో జరుగుతున్న నాలుగవ విడత భూముల రీసర్వే పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఇన్‌చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ గడువులోగా రీసర్వే పనులు పూర్తి చేయాలన్నారు. గ్రౌండ్ ట్రూథింగ్ నోటీసులు జారీ చేశారా లేదా అని కలెక్టర్ ఆరా తీయగా.. అందించారని రైతులు తెలిపారు. సర్వే నంబర్ 56లో పొజిషన్‌ను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. రైతులు అడిగిన పలు సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఆర్టీఓ శ్రీనివాస్, సర్వే ఏడీ రూప్లనాయక్, తహసీల్దార్ పుణ్యవతి, వీఆర్‌ఓలు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.
పీఎస్ హెచ్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి
అనంతపురం: ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల (పీఎస్ హెచ్‌ఎం) సమస్యలు పరిష్కరించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంఘం నేతలు కోరారు. ఈ మేరకు శుక్రవారం డీఈఓ ప్రసాద్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు గోసల నారాయణస్వామి, ప్రధాన కార్యదర్శి రమణ ప్రసాద్, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి గోవిందరెడ్డి ,రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకటరమణ ,రాష్ట్ర కార్యదర్శి మర్రి స్వామి, జిల్లా కోశాధికారి ఈశ్వరయ్య ,కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి,ఆంజనేయులు,మురళీ ప్రసాద్, నాగరాజు, ఈశ్వరయ్య, సుధాకర వర్మ, శివయ్య, హరి నారాయణ, వెంకటకేశవులు పాల్గొన్నారు.
మహిళలపై వీధి కుక్కల దాడి
మహిళలపై వీధి కుక్కల దాడి


