అలజడికి సిద్ధమై.. హంగామాతో సరి
● పారని జేసీ ప్రభాకర్‌రెడ్డి కుయుక్తులు
తాడిపత్రిటౌన్: వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసి అలజడి సృష్టించాలనుకున్న టీడీపీ నేత, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి కుయుక్తులు పారలేదు. శాంతిభద్రతలు అదుపుతప్పకుండా పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. తాడిపత్రి అభివృద్ధిపై చర్చకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రకటించారు. ఇదే సమయంలో పెద్దారెడ్డి ఇంటిని ముట్టడించేందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి టీడీపీ శ్రేణులకు పిలుపునివ్వడంతో పాటు జూనియర్ కళాశాల ప్రాంగణంలో టిప్పర్లతో రాళ్ల కుప్పలు విడిపించారు. పరిస్థితి అదుపుతప్పే అవకాశముందని గ్రహించిన ఏఎస్పీ రోహిత్‌కుమార్ ముందస్తు చర్యలు చేపట్టారు. శుక్రవారం దాదాపు 300 మంది పోలీసు బలగాలతో ఇరుపార్టీ నాయకుల ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. కళాశాల మైదానంలో ఉన్న రాళ్లకుప్పలను ఎత్తివేయించారు. ఇరువురి గృహాల వద్ద నిఘా పటిష్టం చేశారు. చేసేది లేక జేసీ ప్రభాకర్‌రెడ్డి తన నివాసానికి కార్యకర్తలను పెద్ద సంఖ్యలో పిలిపించుకుని మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లి కేతిరెడ్డి పెద్దారెడ్డి తండ్రి కేతిరెడ్డి రామిరెడ్డి విగ్రహం వద్ద హంగామా చేశారు. అక్కడికే తహసీల్దార్ సోమశేఖర్, ఎంపీడీఓ వెంకటాచలపతిని పిలిపించుకొని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించిన ‘పట్టణంలోని ఎర్రవంక ఆక్రమణలు, మండల నిధుల దుర్వినియోగం’పై వాస్తవాలు నిగ్గు తేల్చాలని అర్జీలు అందజేశారు. అయితే దారి మధ్యలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటివైపు వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ మూకలను జేసీ వద్దంటూ వారించడం కనిపించింది.
గన్‌లైసెన్స్ రెన్యూవల్‌లో అవమానం
తాను, తన కుమారుడు ఎమ్మెల్యే అస్మిత్‌రెడ్డి గన్ లైసెన్సుల రెన్యూవల్ కోసం హోం మంత్రి అనితకు లేఖ రాసినా ఎటువంటి స్పందనా లేదని జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక ఎమ్మెల్యే సొంత గన్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోలేని పరిస్థితి ఉందన్నారు. ఈ విషయంలో తమకు అవమానం జరిగినట్టుగానే భావిస్తున్నామని చెప్పారు.
విద్యార్థులకు ఇబ్బందులు
తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యవహారశైలి కారణంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జేసీ వర్గీయులు కళాశాల మైదానాన్ని రణరంగానికి సిద్ధం చేసుకుంటున్నారు. మైదానంలో రాళ్లు వదలడం, అక్కడి నుంచే సమీపంలోని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి పైకి రువ్వుతుండటం పరిపాటిగా మారింది. రెండేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జేసీ తీరును ఏవగించుకుంటున్నారు.


