ఒత్తిళ్లతో బిల్లులు నిలిపేస్తే ఎలా..?
వజ్రకరూరు: గ్రామ పంచాయతీల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో నిలిపివేస్తే ఎలా అంటూ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనుల బిల్లులు కావాలంటే అధికార పార్టీ నియోజకవర్గ ముఖ్యనేతలను కలవాలని, అక్కడి నుంచి అనుమతి వస్తేనే గ్రీన్‌సిగ్నల్ ఇస్తామని అధికారులు చెప్పడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీపీ రమావత్‌దేవి, వైస్ ఎంపీపీ సుంకమ్మ, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు సమావేశాన్ని బహిష్కరించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారంటూ మండల పరిషత్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. బంగారు తాకట్టుపెట్టి తీసుకొచ్చిన డబ్బుతో అభివృద్ధి పనులు చేస్తే అధికారుల నిర్వాకం వల్ల కన్నీళ్లు మిగులుతున్నాయన్నారు. దీనికితోడు సర్పంచులకు 18 నెలలుగా, ఎంపీటీసీలకు 28 నెలలుగా గౌరవవేతనాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో వీధిదీపాలు కూడా వేయనీకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని, అభివృద్ధి పనుల శిలాఫలకాల్లో పేర్లు విస్మరించి అగౌరవపరుస్తున్నారని మండిపడ్డారు. సర్పంచులు సోమశేఖర్‌రెడ్డి, మల్లెల జగదీష్, మోనాలిసా, కొర్రా శివాజీనాయక్, తిరుపాల్‌యాదవ్, భూమా కమలమ్మ, జ్యోతిబాయి, ఎంపీటీసీ సభ్యులు రామక్రిష్ణ, మునయ్య, ముద్దయ్య, పాపన్న, ఈశ్వరమ్మ, పాల్గొన్నారు.


