అక్రమాలకు ఆద్యులు.. విచారణలో పూజ్యులు
బ్రహ్మసముద్రం: ఉపాధి హామీ పథకంలో ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో.. వారే విచారణ సమయంలో అధికారులకు గౌరవప్రదమైన వ్యక్తులుగా మారారు. గమనించిన స్థానిక పాడి రైతులు నివ్వెరపోయారు. అక్రమాలపై విచారణలో పారదర్శకత లేకుండా పోతోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. వివరాల్లోకి వెళితే.. ఉపాధి హామీ పథకం కింద బ్రహ్మసముద్రం మండలంలో గోకులం షెడ్లు మంజూరయ్యాయి. అయితే వీటి నిర్మాణంలో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారు. షెడ్లు నిర్మించకుండానే మొత్తం బిల్లులు ఊడ్చేశారు. ఈ అంశంపై గత సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గొంచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం గొంచిరెడ్డిపల్లిలో డ్వామా అధికారులు విచారణ చేపట్టారు. క్షేత్రస్థాయిలో పారదర్శకంగా విచారణ చేపట్టాల్సిన అధికారులు కాస్త అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేతలతో చేతులు కలిపారు. ముందస్తుగానే సమాచారం ఇచ్చి పెండింగ్‌లో ఉన్న గోకులం షెడ్ల నిర్మాణాలను ఈ నాలుగు రోజుల్లోనే అరకొరగా పూర్తి చేయించారు. ఈ క్రమంలో గురువారం అక్రమాలకు పాల్పడిన వారిని వెంటబెట్టుకుని తనిఖీలు చేపట్టారు. బావా.. తమ్ముడు అంటూ వరుసలు కలిపి టీడీపీ నేతలను గౌరవిస్తూ మరీ తమ వాహనంలో వెంట బెట్టుకుని తిరగాడడం వివాదాస్పదమైంది. ‘డోంట్ వర్రీ నేను ఉన్నా.. మాట్లాడుతా’ అంటూ అక్రమార్కులకు అన్ని విధాలుగా వత్తాసు పలికిన డ్వామా విజిలెన్స్ అధికారి తీరుపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టకుండా కేవలం చుట్టపు చూపుగా అలా చుట్టి వచ్చి ఎంపీడీఓ కార్యాలయంలో కూర్చొని టీడీపీ నేతలతో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చొవడం గమనించిన పాడి రైతులు విస్తుపోయారు. టీడీపీ నేతల అక్రమాలకు వత్తాసు పలికి విచారణను డ్వామా విజిలెన్స్ అధికారి పక్కదారి పట్టించారంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఉపాధి అక్రమాలపై టీడీపీ నేతలతో కలసి అధికారుల తనిఖీలు
విచారణలో పారదర్శకత లోపించిందంటూ విమర్శలు


