ఆరేళ్ల నరకం.. అరుదైన వైద్యం
కర్నూలు(హాస్పిటల్): అరుదైన వ్యాధితో బాధపడుతూ జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ మహిళకు కర్నూలు పెద్దాసుపత్రి వైద్యులు ఊపిరి పోశారు. వివరాలు ఇలా... అనంతపురం జిల్లా డి.హీరేహాల్ మండలం సిద్దాపురం గ్రామానికి చెందిన తులసి(30) ఆరేళ్లుగా తీవ్రమైన శరీర నొప్పులు, కండరాల బలహీనతతో బాధపడుతూ మంచానికే పరిమితమైంది. చికిత్స కోసం రూ.5లక్షలకు పైగా ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. విషయం తెలుసుకున్న సన్నిహితుల నచ్చచెప్పి ఆ ప్రయత్నాన్ని విరమింపజేశారు. వారి సలహాతో దివ్యాంగుల సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఆమె నిర్ధారణ పరీక్షలకు తనకు కేటాయించిన ఆదోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని సదరం క్యాంపునకు హాజరైంది. ఆ సమయంలో ఆమెను ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ నాగరాజు ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించారు. పాస్ఫరస్ తగ్గడం వల్ల ఇలా జరిగిందని నిర్ధారించుకుని, పూర్తిస్థాయి వైద్యపరీక్షలు, చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు గత సంవత్సరం అక్టోబర్ 25న రెఫర్ చేశారు. ఎండోక్రైనాలజి విభాగాధిపతి పి.శ్రీనివాసులు, రాధారాణి బృందం ఆమెకు సమగ్ర వైద్యపరీక్షలు చేయించారు. పీఈటీ స్కాన్‌లో వెన్నుముక చివర కణితి ఉన్నట్లు గుర్తించారు. దీని కారణంగానే శరీరంలో పాస్ఫరస్ తగ్గుతోందని తెలుసుకున్నారు. అవసరమైన శస్త్రచికిత్స కోసం స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించారు. అక్కడ సర్జికల్ ఆంకాలజిస్టులు డాక్టర్ ఎస్.చైతన్యవాణి, డాక్టర్ జి.బీసన్న గత నవంబర్ 10న శస్త్రచికిత్స ద్వారా కణితి తొలగించారు. ఆపరేషన్ జరిగిన 24 గంటల్లోనే ఆమె ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల కనిపించింది. వారం వ్యవధిలోనే ఆమె స్వయంగా నడవగలిగే స్థాయికి చేరుకుంది. గురువారం ఆమెను మీడియా సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు ప్రవేశపెట్టారు. సీఎస్‌ఆర్‌ఎం పద్మజ, ఆర్‌ఎంఓ వెంకటరమణ, అనెస్తెటిస్ట్ భారతి, రేడియాలజిస్టు ఎస్.వినోద్‌కుమార్ పాల్గొన్నారు.


