ఆదుకున్న రాథోడ్
అనంతపురం కార్పొరేషన్: ఆంధ్రతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో విదర్భ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ వైవీ రాథోడ్ స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా.. సమయోచితంగా ఆడి గౌరవప్రదమైన స్కోర్‌కు బాటలు వేశాడు. సెంచరీతో నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా విదర్భ జట్టు తొలి రోజు ఆటముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది. రంజీ ట్రోఫీలో భాగంగా అనంతపురం క్రికెట్ గ్రౌండ్‌లో గురువారం ఆంధ్ర, విదర్భ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ నెగ్గిన విదర్భ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
రాణించిన రాజు
ఆంధ్ర బౌలర్ కేఎస్ రాజు చక్కని లైన్ అండ్ లెంగ్త్‌తో విదర్భ జట్టును ఆదిలోనే కట్టడి చేశాడు. జట్టు స్కోర్ 29 పరుగుల వద్ద ఓపెనర్ మోఖడేను 21 పరుగులకు క్లీన్‌బౌల్డ్ చేయగలిగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన బ్యాటర్ దినేష్ మలేవార్‌ను డకౌట్ చేశాడు. జట్టు స్కోర్ 38 పరుగుల వద్ద ఉన్న సమయంలో మరో ఓపెనర్ అథర్వ టైడే వికెట్‌ను కూలదోశాడు. జట్టు స్కోర్ 47 పరుగుల వద్ద సమర్థ్‌ను (9పరుగులు) పెవిలియన్ బాట పట్టించాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రాథోడ్, వికెట్ కీపర్ రోహిత్.వి.బినకర్ జోడి వికెట్ పడకుండా జాగ్రత్త పడింది. 37 పరుగులు చేసిన రోహిత్‌ను సాయితేజ పెవిలియన్ బాటపట్టించాడు. కెప్టెన్ హర్షదూబే(9పరుగులు)ను నితీష్‌కుమార్ రెడ్డి అవుట్ చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్న రాథోడ్ అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు కొడుతూ స్కోర్ వేగాన్ని పెంచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఆట ముగిసే సమయానికి రాథోడ్ 104 పరుగులు, బూతే 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. మ్యాచ్‌ను ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛోఫెర్రర్, శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు శ్రీనాథ్, కార్యదర్శి యుగంధర్ రెడ్డి పాల్గొన్నారు.


