చిన్న అగ్గి రవ్వ పడిందంటే క్షణాల్లో అంతా బూడిదైపోతోంది. చిన్నచిన్న తప్పిదాలతో నిప్పు రవ్వ కాస్త దావాగ్నిగా మారితే రూ.లక్షల విలువైన ఆస్తులు బుగ్గయిపోతున్నాయి. గుంతకల్లు నియోజకవర్గంలో నెలకొన్న ఈ దయనీయ పరిస్థితిపై ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్పందించడం లేదంటూ | - | Sakshi
Sakshi News home page

చిన్న అగ్గి రవ్వ పడిందంటే క్షణాల్లో అంతా బూడిదైపోతోంది. చిన్నచిన్న తప్పిదాలతో నిప్పు రవ్వ కాస్త దావాగ్నిగా మారితే రూ.లక్షల విలువైన ఆస్తులు బుగ్గయిపోతున్నాయి. గుంతకల్లు నియోజకవర్గంలో నెలకొన్న ఈ దయనీయ పరిస్థితిపై ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్పందించడం లేదంటూ

Jan 22 2026 7:04 AM | Updated on Jan 22 2026 7:04 AM

చిన్న

చిన్న అగ్గి రవ్వ పడిందంటే క్షణాల్లో అంతా బూడిదైపోతోంది.

గుత్తి రూరల్‌: గుంతకల్లు నియోజకవర్గంలో ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటే ఆస్తులు బుగ్గవుతున్నాయి. నియోజకవర్గంలోని మూడు మండలాలకు కలిపి ఒకే ఒక్క అగ్నిమాపక వాహనం ఉండటంతో సకాలంలో ప్రమాదాలు నివారించేందుకు వీలుకావడం లేదు. గుత్తి పట్టణంలో అగ్నిమాపక కేంద్రం స్థాపన అనేది ఓటు బ్యాంక్‌ రాజకీయంగానే మారింది. మూడు దశాబ్ధాలుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. గుంతకల్లు నియోజకవర్గంలోని పామిడి, గుత్తి, గుంతకల్లు మండలాలతో పాటు పక్కనున్న ఉరవకొండ, తాడిపత్రి నియోజకవర్గాల్లోని వజ్రకరూరు, పెద్దవడుగూరు మండలాలకు కలిపి ఒకే ఒక్క అగ్నిమాపక వాహనం ఉండడంతో ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో ఘటనా స్ధలానికి చేరుకుని నష్టం తీవ్రతను అరికట్టడం సాధ్యం కావడం లేదు.

వరుస అగ్ని ప్రమాదాలతో జనం బెంబేలు

గుంతకల్లు నియోజకవర్గంలోని మూడు మండలాల్లో గత రెండేళ్లలో దాదాపు వందకు పైగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రూ.లక్షల్లో బాధితులు నష్టపోయారు. గత ఏడాది 26న గుత్తి మండలంలోని వన్నేదొడ్డిలో రైతు బండి లక్ష్మీనారాయణకు చెందిన వేరుశనగ పొట్టు వామి కాలి రూ.60 వేలు నష్టం వాటిల్లింది. అదే ఏడాది ఫిబ్రవరి 13న అనగానదొడ్డిలో రైతులు పోతుల కృష్ణయ్య, మూలింటి రంగన్న, రామాంజనేయులుకు చెందిన వాములు దగ్ధమయ్యాయి. దీంతో రూ.5 లక్షలు నష్టపోయారు. మార్చి 20న శ్రీపురంలో రైతు ఉండ్ర శివ మినుము పంట తొలగించి నూర్పిడి కోసం పొలంలో వామి వేసి ఉంచగా గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కాలి బూడిదైంది. రూ. 2 లక్షలు నష్టం వాటిల్లింది. అదే నెల 29న ఊబిచెర్లలో గట్టు ఆంజనేయస్వామి ఆలయ దారిలో విద్యుత్‌ స్తంభం కూలి మంటలు చెలరేగడంతో పెద్ద సంఖ్యలో చెట్లు కాలిపోయాయి. జూన్‌ 29న బసినేపల్లి గ్రామ శివారున రైల్వే బ్రిడ్జి కింద బెల్లం పాకంతో వెళుతున్న ట్యాంకర్‌ టైర్లు వేడెక్కి మంటలు చెలరేగడంతో ట్యాంకర్‌ మొత్తం కాలిపోయింది. ఈ నెల 6న ఊబిచెర్ల గ్రామంలో రైతులు చలపతి, రమేష్‌కు చెందిన గడ్డివాములకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో రూ.25వేలు నష్టం వాటిల్లింది. ఈ నెల 18న రాత్రి గుత్తి పట్టణంలోని పారిశ్రామిక వాడలో అగ్గి ప్రమాదం చోటు చేసుకుంది. గుంతకల్లు నుంచి అగ్నిమాపక వాహనం వచ్చేలోపు భారీ నష్టం వాటిల్లింది. గుత్తిలో అగ్నిమాపక వాహనం ఉండ ఉంటే నిమిషాల వ్యవధిలో ప్రమాద స్థలికి చేరుకుని మంటలను అదుపు చేయడం ద్వారా నష్టం తీవ్రత తగ్గేదని బాధితులు వాపోయారు.

ఎమ్మెల్యేకు పట్టని సమస్య

అగ్ని మాపక వాహనాల సంఖ్య పెంచడంతో పాటు గుత్తిలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు అంశంపై గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం దృష్టి సారించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకూ నాలుగు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. మొదటి సమావేశంలో రెండు బిల్లులు ప్రవేశపెట్టగా రెండింటినీ సభ్యులు ఆమోదించారు. అలాగే రెండో సమావేశంలో 21 బిల్లులు ప్రవేశపెట్టి అన్నింటినీ ఆమోదించారు. మూడో సమావేశంలో 9 బిల్లులు ప్రవేశపెట్టి తొమ్మిదింటినీ, నాలుగు సమావేశంలో 23 బిల్లులు ప్రవేశపెట్టి అన్నింటికీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అయితే ఇప్పటి వరకూ జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఏనాడూ గుంతకల్లు నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్న అగ్ని ప్రమాదాలపై ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రస్తావించింది లేదు. మూడు దశాబ్దాలుగా ప్రతిపాదనలకే పరిమితమైన గుత్తిలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు కూడా ప్రస్తుతం కలగానే మిగిలిపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే జయరాం స్పందించాలని, అగ్ని ప్రమాదాల నివారణకు వాహనాల సంఖ్యను పెంచడంతో పాటు గుత్తిలో కేంద్రం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.

గుత్తి మండలం బసినేపల్లిలో దగ్ధమైన అరటి చెట్లు (ఫైల్‌)

రెండేళ్లలో వందకు పైగా అగ్ని ప్రమాదాలు

గుత్తిలో ప్రతిపాదనలకే పరిమితమైన అగ్నిమాపక కేంద్రం

మూడు మండలాలకు కలిపి ఒక్కటే వాహనం

సమస్య పరిష్కారంపై దృష్టి సారించని ఎమ్మెల్యే గుమ్మనూరు

8 గడ్డి వాములు దగ్ధం

గుత్తి: స్థానిక బీసీ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో బుధవారం వరుసగా ఉన్న ఎనిమిది వరి గడ్డి, సొప్ప, వేరుశనగ పొట్టు వాములు కాలి బూడిదయ్యాయి. దీంతో రైతులు హరికృష్ణ, రామకృష్ణ, తిమ్మారెడ్డి, లక్ష్మీదేవి, ప్రభావతి రూ. 8 లక్షలకు పైగా నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. సంఘటనా స్థలాన్ని సీఐ రామారావు పరిశీలించారు. గడ్డివాములు బూడిదైన తర్వాత గుంతకల్లు నుంచి ఫైర్‌ సిబ్బంది అక్కడకు చేరుకోవడం గమనార్హం.

ప్రభుత్వానికి నివేదించాం

గుత్తిలో ఫైర్‌ స్టేషన్‌ ఏర్పాటు ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించాం. అనేక ఏళ్లుగా ఇందుకు సంబంధించి ప్రజలు, ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలు కలెక్టరేట్‌ వరకే వెళ్లాయి. ఇక మా శాఖ తరఫున ప్రభుత్వానికి నేరుగా విన్నవించాం. అనుమతులు మంజూరై భూమి కేటాయింపులు జరిగితే గుత్తిలో ఫైర్‌ స్టేషన్‌ను అందుబాటులోకి తెస్తాం

– అశ్వత్థ, ఏడీఎస్‌ఓ, గుంతకల్లు

చిన్న అగ్గి రవ్వ పడిందంటే క్షణాల్లో అంతా బూడిదైపోతోంది.1
1/1

చిన్న అగ్గి రవ్వ పడిందంటే క్షణాల్లో అంతా బూడిదైపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement