పదేపదే బెదిరిస్తూ నిప్పు పెట్టించాడు
● ఎమ్మెల్యే దగ్గుపాటిపై టీడీపీ కేంద్ర కార్యాలయానికి నంబూరి వైన్స్ నిర్వాహకుడి ఫిర్యాదు
అనంతపురం సెంట్రల్: మద్యం షాపు నడుపుకోవాలంటే తనకు మామూలు ఇవ్వాలంటూ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పదేపదే బెదిరిస్తూ చివరకు తన మద్యం షాపునకు నిప్పు పెట్టించాడని టీడీపీ కేంద్ర కార్యాలయానికి నంబూరి వైన్స్ నిర్వాహకుడు నంబూరి వెంకటరమణ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బుధవారం విజయవాడలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రజా గ్రీవెన్స్‌లో పార్టీ పెద్దలకు వినతి పత్రం అందజేసి, ఎమ్మెల్యే దగ్గుపాటి అక్రమాలపై ఏకరవు పెట్టాడు. అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అభ్యునత్ని కోసం పనిచేస్తూ వచ్చిన తన పట్లనే ఇంత నిర్దయగా ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యవహరిస్తున్నాడంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోలేమని వివరించినట్లు సమాచారం. ఎమ్మెల్యే దూకుడుకు అడ్డుకట్ట వేసి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. సీఎం దృష్టికి సమస్యను తీసుకెళ్లి న్యాయం చేస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్లు బాధితుడు నంబూరి వెంకటరమణ తెలిపారు.
ఏపీఈసెట్ కన్వీనర్‌గా దుర్గాప్రసాద్
అనంతపురం: ఏపీ ఈసెట్ –2026 నిర్వహణ బాధ్యతను దక్కించుకున్న జేఎన్‌టీయూ(ఏ)... సెట్ కన్వీనర్‌గా మెకానికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ దుర్గాప్రసాద్‌ను నియమించింది. దీంతో బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను ఏపీ ఈసెట్ చైర్మన్, వీసీ ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు అభినందించారు. కాగా, ఏపీఈసెట్ నిర్వహణ బాధ్యతను పదో దఫా జేఎన్‌టీయూ (ఏ)కు అప్పగించడం విశేషం. ప్రొఫెసర్ దుర్గాప్రసాద్ రెండో సారి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఏడు దఫాలు ప్రొఫెసర్ పీఆర్ భానుమూర్తి, ఒకసారి ప్రస్తుత ఏపీపీఎస్సీ చైర్మెన్‌గా ఉన్న ప్రొఫెసర్ సి.శశిధర్ కన్వీనర్‌గా వ్యవహరించారు.
30న బసివినుల గ్రీవెన్స్
అనంతపురం అర్బన్: బసివినుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 30న ప్రత్యేక పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇన్‌చార్జ్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆదేశాల మేరకు అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్లు ఆర్‌డీఓ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ప్రత్యేక పరిష్కార వేదిక ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.
పదేపదే బెదిరిస్తూ నిప్పు పెట్టించాడు


