విసిరేసిన మాతృత్వం..
మానవత్వం మంట కలుస్తోంది. జన్మించిన గంటల వ్యవధిలోనే కన్న పేగును నిర్దయగా వదిలించుకున్నారు. కారణమేదైనా అమానవీయ ఈ ఘటన గుత్తిలో చోటు చేసుకుంది.
గుత్తి: ఓ మాతృమూర్తి నవమాసాలు మోసి కన్న ముక్కుపచ్చలారని కుమార్తెను మానవత్వం మరిచి ఓ ఇంటి గడప వద్ద వదిలి వెళ్లిన ఘటన గుత్తి పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుత్తిలోని కుంట కట్ట వద్ద నివాసముంటున్న మైనుద్దీన్ ఇంటి ఎదుట బుధవారం ఉదయం ఓ ప్లాస్టిక్ కవర్‌లో నవజాత ఆడశిశువు కనిపించింది. తల్లి గర్భం నుంచి బయటపడే సమయంలో దేహానికి అంటిన రక్తపు మరకలు కూడా అలాగే ఉన్నాయి. అప్పటికే స్థానికులు గుమికూడారు. సమాచారం అందుకున్న ఏఎస్‌ఐ నాగమాణిక్యం, సిబ్బంది, ఐసీడీఎస్ అధికారులు అక్కడకు చేరుకున్నారు. ప్రాణముందన్న ఆశతో ఆగమేఘాలపై ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు శిశువు మృతి చెందినట్లు నిర్దారించారు. అయితే శిశువును ఎవరు వదిలి వెళ్లారో తెలియడం లేదు. ఈ ఘటనపై సీఐ రామారావు, సీడీపీఓ యల్లమ్మ, సూపర్‌వైజర్ రాజేశ్వరి, 1098 సిబ్బంది లోతుగా విచారణ చేపట్టారు. ఒకవేళ శిశువు ముందే మృతి చెంది ఉంటే మానవత్వంతో ఖననం చేయడమో లేక, ఇష్టం లేకపోతే నిర్మానుష్య ప్రాంతంలోనో పడేసేవారు. ప్రాణముండడంతో ఎవరైనా తీసుకెళ్లి పెంచుకుంటారనే ఆశతోనే ఓ ప్లాస్టిక్ కవర్‌లో ఉంచి ఊపిరి ఆడేలా కవర్ మూత తీసి పెట్టి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మృత శిశువును గుత్తి ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచారు.
నవజాత ఆడశిశువును శిశువును వదిలి వెళ్లిన వైనం
స్థానికులు గమనించేలోపు మృతి


