న్యాయ విద్యార్థిని ఆత్మహత్య
అనంతపురం సెంట్రల్: రాప్తాడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున కుమార్తె భవాని (19) ఆత్మహత్య చేసుకుంది. అనంతపురంలోని అశోక్ నగర్‌లో ఉన్న ప్రైవేట్ బాలికల హాస్టల్‌లో ఉంటూ నగరంలోని ఓ ప్రైవేటు లా కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న ఆమె మంగళవారం సాయంత్రం తన గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సహచర విద్యార్థినులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. భవాని మృతదేహాన్ని జీజీహెచ్‌లోని మార్చురీకి తరలించారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణంగా పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వన్‌టౌన్ పీఎస్ ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపారు.
చేపలు పట్టేందుకు వెళ్లి..
కణేకల్లు: మండలంలోని యర్రగుంట శివారులో హెచ్చెల్సీలో చేపలు పట్టేందుకు వెళ్లిన కణేకల్లుకు చెందిన చాంద్‌బాషా (42) ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడు. కణేకల్లులోని మత్స్య కార్మికుల కాలనీలో నివాసముంటున్న చాంద్‌బాషా, మున్నీ దంపతులు కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. సోమవారం సాయంత్రం తన స్నేహితుడు ఉలిగప్పతో కలిసి యర్రగుంట శివారులోని హెచ్చెల్సీలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. కాలువలో వల వేసే క్రమంలో అదుపు తప్పి నీటిలో పడ్డాడు. ఈత రాకపోవడం, లోతు ఎక్కువగా ఉండడంతో నీట మునిగిపోయాడు. సోమవారం సాయంకాలం వెళ్లిన భర్త మంగళవారం ఉదయమైనా రాకపోవడంతో భార్య మున్ని పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఉలిగప్పను విచారించగా జరిగిన ఘటనను వివరించాడు. మంగళవారం ఉదయం హెచ్చెల్సీలో తేలిన చాంద్‌బాషా మృతుదేహాన్ని వెలికి తీయించి, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
లారీని ఢీకొన్న కారు
బత్తలపల్లి: స్థానిక 42వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు.. చిత్తూరు నుంచి గుంతకల్లుకు వెళుతున్న కారు మంగళవారం తెల్లవారుజామున బత్తలపల్లి టోల్‌ఫ్లాజా వద్దకు చేరుకోగానే రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న గుంతకల్లులోని మదీనాబాద్ ప్రాంతానికి చెందిన వేణుగోపాల్, ప్రేమలత తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ నవీన్‌కుమార్, చార్లెస్ వరప్రసాద్, షారూణ్ హర్ష సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స పొందిన అనంతరం అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటనపై తమకు ఎలాంటి సమాచారం లేదని పోలీసులు పేర్కొన్నారు.
న్యాయ విద్యార్థిని ఆత్మహత్య


