అరాచకాల దగ్గుపాటిని వెంటనే బర్తరఫ్ చేయాలి
అనంతపురం: అంతులేని అరాచకాలకు పాల్పడుతున్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ను తక్షణమే బర్తరఫ్ చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు బుసిరెడ్డి శ్రీదేవి డిమాండ్ చేశారు. జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ మహిళా విభాగం నేతలతో కలసి ఆమె మాట్లాడారు. అనంతపురం నగరంలో ఎమ్మెల్యే దండుపాళ్యం బ్యాచ్ ఆగడాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరి భూమిపై వారి కన్ను పడుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. నెలకోసారి స్థిరాస్తుల వివరాలను ఆన్‌లైన్ సరిచూసుకోవాలని, లేకపోతే డబుల్ రిజిస్ట్రేషన్‌తో వాటిని కాజేసే ప్రమాదముందని హెచ్చరించారు. తన భూమినే కాజేయాలని ప్రయత్నిస్తున్నారంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి అరాచకాలను ఇటీవల టీడీపీ మహిళా నాయకురాలు స్వప్న బయటపెట్టారని గుర్తు చేశారు. కంటి వైద్యురాలి భర్తను పరుష పదజాలంతో దూషించిన ఆడియో వైరల్ అవుతోందన్నారు. ఓ ముస్లిం మహిళ అని కూడా దుర్భాషలాడిన ఈ అంశంపై సుమోటోగా కేసు నమోదు చేయాలని ఎస్సీని డిమాండ్ చేశారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడిపై ఏకంగా దాడి చేసి దౌర్జన్యానికి పాల్బడ్డారని పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించినప్పుడే .. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను తక్షణమే బర్తరఫ్ చేసి అనంతపురం నియోజకవర్గంలో శాంతి భద్రతలు కాపాడాలని డిమాండ్ చేశారు. మహిళలను కించరిచేలా మాట్లాడినందుకు వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాయాదవ్, కార్యదర్శి భారతి, ఎస్టీ సెల్ కార్యదర్శి శోభాబాయి, నగర ప్రధాన కార్యదర్శి ప్రసన్న, నగర కార్యదర్శి చంద్రకళ, ఎగ్జిక్యూటీవ్ మెంబర్ సుగుణ తదితరులు పాల్గొన్నారు.
దండుపాళ్యం బ్యాచ్ ఆగడాలపై అప్రమత్తంగా ఉండాలి
వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీదేవి డిమాండ్


