ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి
● ఉద్యోగులకు ఇన్‌చార్జ్ కలెక్టర్ సూచన
అనంతపురం అర్బన్: ‘విధి నిర్వహణలో ఎన్నో ఒత్తిళ్లకు గురవుతుంటారు. ఈ క్రమంలో వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కాబట్టి ఎవరూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి’ అంటూ రెవెన్యూ, సర్వే శాఖ అధికారులు, ఉద్యోగులకు ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ సూచించారు. రెవెన్యూ, సర్వే ఉద్యోగుల కోసం కలెక్టరేట్ ప్రాంగణంలో మంగళవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపును లాంఛనంగా ప్రారంభించారు. శిబిరంలో ఏర్పాటు చేసిన వివిధ వైద్య పరీక్షల విభాగాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్యోగులు ఆరోగ్య శ్రేయస్సును ఆకాంక్షించి జిల్లా వైద్య ఆరోగ్య, రెవెన్యూ శాఖల సమన్వయ సహకారాలతో ప్రత్యేకంగా మూడు రోజులపాటు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 21 వరకు మూడు రోజుల పాటు వైద్య శిబిరం ఉంటుందన్నారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో రోగ నిర్ధారణ పరీక్షలు, ఉచితంగా మందుల పంపిణీ ఉంటుందన్నారు. రెవెన్యూ, సర్వే శాఖల్లోని అన్నిస్థాయిల ఉద్యోగులు ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మలోల, డీఎంహెచ్‌ఓ ఈబీ దేవి, ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లీశ్వరి, ఆర్‌డీఓలు కేశవనాయుడు, వసంతబాబు, ఎన్టీఆర్ వైద్యసేవ కో–ఆర్డినేటర్ గంగాధర్‌రెడ్డి, కలెక్టరేట్ ఏఓ అలెగ్జాండర్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ యుగేశ్వరిదేవి, తహసీల్దార్ హరికుమార్ పాల్గొన్నారు.


