అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ
● ఎస్‌సీఆర్ జీఎం సంయ్‌కుమార్ శ్రీవాత్సవ్
గుంతకల్లు: విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉన్నప్పుడే ప్రమాదాలను నివారించగలుగుతామని సిబ్బందికి దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాత్సవ్ సూచించారు. మంగళవారం ప్రత్యేక రైలులో గుంతకల్లు రైల్వేస్టేషన్ చేరుకున్న జీఎంకు డీఆర్‌ఎం చంద్రశేఖర్‌గుప్తా, ఏడీఆర్‌ఎం యూ.సుధాకర్‌లు స్వాగతం పలికారు. ఏఆర్‌టీ (యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్), ఎంఆర్‌టీ (మెడికల్ రిలీవ్ వ్యాన్)ను పరిశీలించారు.అనంతరం క్రూ లాబీని తనిఖీ చేశారు. రన్నింగ్ స్థాఫ్ వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు వారి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం రైల్వేస్టేషన్‌లోని మీటింగ్ చాంబర్ సేఫ్టీ సెమినార్‌ను నిర్వహించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. రైలు మార్గం, సిగ్నిల్ పాయింట్ల వద్ద భద్రతాపై నిఘా పెంచాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఆటోమెటిక్ సిగ్నిల్ అండ్ లోకేషన్ ఆఫ్ రైట్ హ్యండ్ సిగ్నిల్స్ బ్రోచర్‌లను విడుదల చేశారు. అనంతరం రైల్వే భద్రత పర్యవేక్షణలో భాగంగా బళ్లారి–గుంతకల్లు–డోన్–నంద్యాల సెక్షన్‌లోని రైలు మార్గాలను ప్రత్యేక రైళ్లల్లో పరిశీలించారు. కార్యక్రమంలో జోనల్ పీసీఓఎం పద్మజ, పీసీఈ ఆంజనేయులురెడ్డి, డీఈ సందీప్‌జైన్, పీసీహెచ్‌ఓ వెంకటరమణారెడ్డి, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.


