సహాయకుడు లేడని నిర్దయ
గుత్తి రూరల్: సహాయకుడు లేని కారణంగా క్షతగాత్రుడిని తరలించలేమంటూ 108 సిబ్బంది పేర్కొనడంతో మూడు రోజులుగా గుత్తిలోని ప్రభుత్వాస్పత్రిలోనే ఆకలిదప్పికలతో ఓ క్షతగాత్రుడు అలమటిస్తున్నాడు. వివరాలు.. మండలంలోని కొత్తపేట గ్రామ శివారున 67వ జాతీయ రహదారిపై ఈ నెల 18న అర్ధరాత్రి సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ గుర్తు తెలియని, మతిస్థిమితం లేని యువకుడి (యాచకుడు)ని గుర్తు తెలియని వాహనం ఢీకొన్న విషయం తెలిసిందే. అటుగా వెళుతున్న వారి సమాచారంతో క్షతగాత్రుడిని 108 సిబ్బంది చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. కుడి కాలు విరిగి తీవ్రంగా గాయపడిన యువకుడికి వైద్యులు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి రెఫర్ చేశారు. అయితే అనంతపురానికి తీసుకెళ్లేందుకు 108 వాహన సిబ్బంది నిరాకరించారు. సహాయకులు ఎవరూ లేకపోవడంతో ఒక్కడిని తీసుకెళ్లడం కుదరదంటూ తేల్చి చెప్పారు. దీంతో మూడు రోజులుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో అన్నపానీయాలు లేక నీరసించిపోయాడు. ఇప్పటికై నా అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని అనాథ వ్యక్తిని జీజీహెచ్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించేలా చొరవ తీసుకోవాలని ఆస్పతి సిబ్బంది కోరుతున్నారు.


