25న పెన్నహోబిలంలో రథసప్తమి వేడుకలు
ఉరవకొండ రూరల్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలంలో ఈ నెల 25న రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జ్ ఈఓ తిరుమల్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రథసప్తమి రోజు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నృసింహస్వామి మూలవిరాట్‌లకు ప్రత్యేక పంచామృతాభిషేకాలు, సహస్త్రనామార్చన, సూర్యప్రభ, గోవాన, హనుమంత, గరుడ వాహనోత్సవాలు నిర్వహించనున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయనున్నట్లు ఆలయ ఇన్‌చార్జ్ ఈఓ తెలిపారు.
భద్రతా ప్రమాణాలు లేవు
● స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ తనిఖీలో తేల్చిన అధికారులు
బొమ్మనహాళ్: నేమకల్లు శివారులోని రామాంజినేయ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలో జిల్లా అధికారులు తనిఖీలు చేపట్టారు. కన్వేయర్ బెల్టు దగ్గర ప్రెజర్ వీల్ విడిపోయి బలంగా తగలడంతో నరసింహులు అనే హెల్పర్ మృతి చెందిన విషయం విదితమే. ‘ఫ్యాక్టరీల్లో భద్రత గాలికి’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి డీసీఐఎఫ్ రాధాకృష్ణ, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మురళీ కృష్ణ, ఏఎస్‌ఐ హనుమంతరెడ్డి స్పందించి సోమవారం రామాంజినేయ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీని తనిఖీ చేశారు. హెల్పర్ చనిపోయిన ప్రదేశాన్ని నిశితంగా పరిశీలించారు. ఫ్యాక్టరీలో కార్మికుల భద్రతకు ఎలాంటి రక్షణ పరికరాలు అందుబాటులో లేవని, కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని ప్రాథమికంగా నిర్ధారించారు. కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు లేవని, మృతి చెందిన కార్మికునికి ఆ సౌకర్యాలు ఉంటే కుటుంబానికి ఇన్సూరెన్స్ వచ్చేదన్నారు. ప్రమాదం జరిగిన చోట విద్యుత్ లైట్లు కూడా లేకపోవడం ఏమిటని యజమాన్యాన్ని అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు అధికారులు తెలిపారు.
విద్య.. దేశ నిర్మాణానికి దోహదపడాలి
అనంతపురం: ‘విద్య కేవలం డిగ్రీలకే పరిమితం కాకూడదు. దేశ నిర్మాణానికి దోహదపడినపుడే నిజమైన విద్య’ అని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు వీసీ ప్రొఫెసర్ ఎన్.కృష్ణన్ అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీలోని మాలవ్య మిషన్ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ‘పాఠ్యక్రమంలో భారతీయ జ్ఞాన పరంపర – సమన్వయం’ అనే అంశంపై ఆరు రోజుల కార్యక్రమం సోమవారం ప్రారంభించారు. కార్యక్రమానికి ఎన్.కృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉన్నత విద్య డిగ్రీల ప్రదానానికే పరిమితం కాకుండా సామాజిక బాధ్యత, దేశ నిర్మాణం దిశగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తిరువళ్లువర్ రచనలు, అలాగే కర్ణాటక సంగీత త్రయం అయిన త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి సంప్రదాయాలను ఉదహరిస్తూ, నైతికత, సంస్కృతి, దైనందిన జీవన విధానాల రూపకల్పనలో భారతీయ జ్ఞాన పరంపర శాశ్వత ప్రాసంగికతను వివరించారు. ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించిన సెంట్రల్ వర్సిటీ ఆఫ్ ఏపీ వీసీ కోరి మాట్లాడుతూ భారతీయ జ్ఞాన పరంపర అనుభవాత్మక, సమగ్ర విద్యకు బలమైన పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు. దేశంలోని విద్యావంతులలో యువత సుమారు 60 శాతం ఉన్న నేపథ్యంలో, సమకాలీన సామాజిక, నైతిక, సాంకేతిక సవాళ్లను ఎదుర్కోవడానికి, సుస్థిర జాతీయ అభివృద్ధిని సాధించడానికి ఏఐ సమన్వయం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు డీన్ ప్రొఫెసర్ సి.షీలారెడ్డి మాట్లాడారు. డాక్టర్ సరళ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.
25న పెన్నహోబిలంలో రథసప్తమి వేడుకలు
25న పెన్నహోబిలంలో రథసప్తమి వేడుకలు


