ఆలకించండి.. ఆదుకోండి
● సమస్యలపై పోటెత్తిన ప్రజలు
● పరిష్కార వేదికలో 390 వినతులు
● ఈ దివ్యాంగుని పేరు గట్టు శ్రీరాములు. అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి పంచాయతీ బీజేపీ కాలనీలో నివాసముంటున్నాడు. 2023లో బ్రెయిన్‌కు ఆపరేషన్ జరిగింది. 2024 ఫిబ్రవరి 13న 45 శాతం వైకల్యం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. ఎడమ చేయి పూర్తిగా పనిచేయదు. చేతికర్ర ఆసరా లేనిదే నడవలేడు. పింఛను కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదని వాపోయాడు. అధికారులను అడిగితే కలెక్టరేట్‌కు వెళ్లాలని చెప్పడంతో ఇక్కడకు వచ్చానన్నాడు.
అనంతపురం అర్బన్: వివిధ సమస్యలపై అర్జీదారులు పోటెత్తారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో పాటు అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్‌ఓ మలోల, ఎఫ్‌ఎస్‌ఓ రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ కేశవనాయుడు, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, మల్లికార్జునుడు ప్రజల నుంచి 390 అర్జీలు స్వీకరించారు. ఇందులో చాలామంది పింఛన్ కోసం అర్జీలు అందజేశారు. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో ఇన్‌చార్జ్ కలెక్టర్ సమీక్షించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు.
అర్జీల్లో కొన్ని...
● వృద్ధాప్య పింఛను మంజూరు చేయాలని విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామం బీసీ కాలనీకి చెందిన వడ్డే ఆంజనేయులు విన్నవించాడు. తన వయసు 66 ఏళ్లు దాటిందని చెప్పాడు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదన్నాడు. దయచూపి పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని కోరాడు.
● చేనేత పింఛను మంజూరు చేయాలని తాడిపత్రి పట్టణం రాగితోటపాళెంకు చెందిన వి.లక్ష్మినరసింహులు కోరాడు. తాను చేనేత పనిచేస్తూ జీవనం సాగిస్తున్నానని చెప్పాడు. పని అంతంతమాత్రంగా ఉండడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని తెలిపాడు. పింఛను మంజూరు చేస్తే కొంత ఊరట కలుగుతుందని వేడుకున్నాడు.
ఆలకించండి.. ఆదుకోండి


