జిల్లా అంతటా సోమవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. చ
నిజాలు నిగ్గుతేలేనా..?
● నిధుల దుర్వినియోగంపై గుట్టుగా విచారణ
తాడిపత్రిటౌన్: గ్రామపంచాయతీల్లో నిధుల దుర్వినియోగంపై జిల్లాస్థాయి అధికారుల విచారణ గుట్టుగా జరుగుతుండటం విమర్శలకు తావిస్తోంది. నిజాలు నిగ్గు తేల్చకుండా అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల నేపథ్యంలో విచారణను మమ అనిపిస్తారేమోనన్న చర్చ జరుగుతోంది. తాడిపత్రి మండలంలోని పలు గ్రామపంచాయతీల్లో అభివృద్ధి పనుల పేరిట అధికార పార్టీ నాయకులు చేయని పనులకు బిల్లులు చేసుకుని రూ.5 కోట్ల మేర నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు గత నెల 29న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం కదిలింది. సమగ్ర విచారణకు అధికారులను ఆదేశించింది. అయితే విచారణ రెండుదఫాలు వాయిదా పడింది. ఈ క్రమంలో ఎవ్వరికీ తెలపకుండా శనివారం జిల్లా అధికారులు మండలపరిషత్ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. గంగాదేవిపల్లి, ఊరుచింతల, తేరన్నపల్లి, ఇగుడూరు, భోగసముద్రం, దిగువపల్లి, చల్లవారిపల్లి, గన్నెవారిపల్లి తదితర 13 పంచాయతీలలో 2024 నుంచి 2026 వరకు జరిగిన అభివృద్ధి పనులు, వాటి బిల్లులకు సంబంధించిన సమాచారాన్ని అందజేయాలని ఆయా పంచాయతీల కార్యాదర్శులను కోరినట్లు తెలిసింది. అయితే విచారణ అత్యంత గోప్యంగా సాగుతుండటం అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీ నాయకులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా విచారణ నివేదిక రూపొందించనున్నట్లు మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.


