ఫ్యాక్టరీల్లో భద్రత గాలికి
కనీస సౌకర్యాలు లేవు
నేను పని చేస్తున్న స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలో యాజమాన్యం కనీస వసతులు కల్పించడం లేదు. ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు అంతంతమాత్రమే. చివరకు పనికి తగిన వేతనాలు కూడా ఇవ్వడం లేదు. అనారోగ్యానికి గురైనా యజమాన్యం పట్టించుకోవడం లేదు. వేతనాలు, సౌకర్యాలు గురించి ప్రశ్నిస్తే పనుల్లో నుంచి తీస్తేస్తున్నారు. ప్రమాదాల మధ్యనే పనిచేస్తున్నాం. ఏ ఒక్క అధికారీ ఫ్యాక్టరీని తనిఖీ చేసిందే లేదు. ఫ్యాక్టరీ యజమానులు ఏది చేప్పితే అదే వేదం.
– ఓ కార్మికుడి ఆవేదన
అధికారుల దృష్టికి తీసుకెళ్లాం
నేమకల్లు గ్రామ శివారులో ఉన్న రామాంజినేయ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలో శనివారం కన్వేయర్ బెల్ట్ దగ్గర పనిచేస్తుండగా ప్రెజర్ వీల్ విడిపోయి నరసింహులు అనే హెల్పర్ చనిపోయాడు. ఈ విషయంపై కార్మిక శాఖ అధికారులకు, కలెక్టర్‌కు సమాచారం చేరవేశారు. జిల్లా ఉన్నతాధికారులు ఫ్యాక్టరీని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే మృతుడి భార్య ఫిర్యాదు మేరకు బొమ్మనహాళ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
– మునివేలు, తహసీల్దార్ బొమ్మనహాళ్
బొమ్మనహాళ్: కార్మికుల భద్రత చట్టాలను పలు ఫ్యాక్టరీల యజమానులు అమలు చేయడం లేదు. లాభాలపై ఉన్న శ్రద్ధ కార్మికుల భద్రతపై పెట్టడం లేదు. ఫలితంగా ప్రమాదాల బారిన పడి ఎంతోమంది కార్మికుల జీవితాలు గాలిలో కలిసిపోతున్నాయి. బొమ్మనహాళ్, డీ.హీరేహాళ్ మండలాల్లోని స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీల్లో స్థానికులతో పాటు పొరుగున ఉన్న కర్ణాటకకు చెందిన ఎంతోమంది కార్మికులు పనిచేస్తున్నారు. ముఖ్యంగా స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీల్లో యాజమాన్యం కార్మికుల కోసం కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. యంత్రాల వద్ద పనిచేసే కార్మికులకు రక్షణ పరికరాలను సైతం సమకూర్చడం లేదు. అనుభవం ఉన్న కార్మికులను విధుల్లో పెట్టుకుంటే ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి వస్తుందని.. అనుభవం లేని కార్మికులను పనుల్లో పెట్టుకుంటున్నారు. కార్మికులకు రక్షణ పరికరాలను ఇవ్వకపోవడం, యంత్రాల పనితీరుపై అవగాహన లేకపోవడం, ప్రమాదాలు సంభవిస్తే తప్పించునే జాగ్రత్తలు తెలియకపోవడంతో చిన్నచిన్న ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. కొన్ని ఘటనల్లో కార్మికులు మృత్యువాత పడుతున్నారు. సదరు బాధిత కుటుంబాలను ఆదుకోవడంలోనూ యాజమాన్యాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఈ రెండు మండలాల్లో స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలు పదుల సంఖ్యలో ఉన్నా ఒక్క ఫ్యాక్టరీలో కూడా సేఫ్టీ ఆఫీసర్లు లేకపోవడం గమనార్హం.
అధికారుల పర్యవేక్షణ కరువు..
స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న వారికి కార్మిక చట్టాలు.. రక్షణ పరికరాల గురించి అవగాహన లేదు. ఇదే అదునుగా భావిస్తున్న యజమాన్యాలు తమ ఫ్యాక్టరీల్లో 100 మంది కార్మికులు విధులు నిర్వహిస్తే.. అందులో 40 మందికి కూడా ఈఎస్‌ఐ, పీఎఫ్ తదితర సౌకర్యాలు కల్పించడం లేదు. కనీసం అంతర్రాష్ట్ర కార్మిక చట్టాలను కూడా అమలు చేయడం లేదు. ఈ అంశాలపై ఫ్యాక్టరీల అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలను ఏడాదికి ఒక్కసారి కూడా తనిఖీ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కార్మికుల భద్రతపై చర్యలు తీసుకున్న దాఖలాలూ లేవు.
స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ ప్రమాదాల్లో
మచ్చుకు కొన్ని..
● ఈ నెల 17న బొమ్మనహాళ్ మండలం నేమకల్లు శివారులోని రామాంజినేయ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలో బోయ నరసింహులు (35) అనే హెల్పర్ శుక్రవారం అర్ధరాత్రి తర్వాత 2 గంటల సమయంలో కన్వేయర్ బెల్ట్ దగ్గర పనిచేస్తుండగా ప్రెజర్ వీల్ విడిపోయి అతని కాలుకు, మర్మాంగానికి బలంగా తగిలింది. దీంతో తీవ్ర రక్తస్రావమై మృతి చెందాడు.
● 2021 మే 30న రామాంజినేయ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలో గోపాల్ అనే యువకుడు పని చేస్తున్న సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో కుడి చేయి పోగొట్టుకున్నాడు.
● గత మూడేళ్ల కిత్రం ఓ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలోని పంప్ హౌస్ హాట్ వాటర్‌లో పడి ఓ కార్మికుడు మృత్యువాత పడ్డాడు.
● గడిచిన ఏడేళ్లలో దాదాపు 20 మందికి పైగా ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ గాయాలపాలయ్యారు.
రక్షణ పరికరాలు సమకూర్చని
యాజమాన్యాలు
తరచూ ప్రమాదాలతో
బలైపోతున్న కార్మికులు
కొరవడిన అధికారుల పర్యవేక్షణ


