అడవుల సంరక్షణకు చర్యలేవీ?
కుందుర్పి: అడవుల సంరక్షణను అధికారులు గాలికొదిలేశారు. తగినంత సిబ్బంది లేరన్న కారణంతో విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఖాళీల భర్తీపై దృష్టి సారించకపోవడంతో అడవులు పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. కుందుర్పి మండలం కలిగొలిమి సమీపంలో జంబుగుంపల అటవీ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం నిప్పంటుకుంది. ఆకతాయిలెవరైనా ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారా.. ప్రమాదవశాత్తూ నిప్పు రాజుకుని మంటలు వ్యాపించాయో తెలియదు. ఆ రోజు నుంచి నిరంతరాయంగా కాలుతూనే ఉంది. జంబుగుంపల అటవీ ప్రాంతం 6,800 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం అటవీ ప్రాంతంలోని ఊరకొండ, ఉచ్చికాయల పెంట, దావానుపెంట, గౌరమ్మపెంట, పావురాల గుండ ప్రాంతం, పుల్లల ఈగలగొంది, బూదిగుండ్లు తదితర ప్రాంతాల్లో ఉన్న టేకు, గాలిబుడుగు, తుమ్మ,జాలి, చీమచిగురు, శ్రీగంధం, దాదారు, నీరద్ది, వెదురు, కానుగ, పచ్చారి వంటి విలువైన మొక్కలు పూర్తిగా కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. వృక్ష సంపదతో పాటు ఆలువలు, ముళ్లపందులు, ఉడుములు, యంటువలు, కుందేళ్లు వంటి వన్యప్రాణులు మంటల్లో చిక్కుకుని చనిపోయాయని చెబుతున్నారు.
సిబ్బంది ఏరీ..?
జంబుగుంపల అటవీ ప్రాంతం సంరక్షణకు కనీసం నలుగురు సిబ్బంది అవసరం. కానీ ఒక్క బీట్ ఆఫీసర్ మాత్రమే ఉన్నారు. పక్కనున్న మూడు వేల ఎకరాల్లోని కర్ణాటక పుట్రాళ్లపల్లి అటవీ ప్రాంతానికి ఎనిమిది మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 6,800 ఎకరాల విస్తీర్ణం కలిగిన జంబుగుంపల అటవీ ప్రాంతానికి ఉన్న ఒక్క అధికారి కళ్యాణదుర్గం రేంజ్ కార్యాలయంలో జరిగే సమావేశాలు, ఇతర పనులకు పరిమితమైపోయారని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు.
హడావుడిగా అవగాహన సదస్సులు..
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది అటవీశాఖ అధికారుల పనితీరు. ‘జంబుగుంపల అడవికి నిప్పు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో కళ్యాణదుర్గం అటవీ సెక్షన్ అధికారులు మల్లికార్జున, సూర్యనారాయణ, జంబుగుంపల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరమేశ్వరప్ప తదితరులు స్పందించారు. అప్పిలేపల్లి, కుందుర్పి, జంబుగుంపల గ్రామాల్లో అడవులకు నిప్పు పడకుండా తీసుకోవాల్చిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
తరచూ అగ్నికి ఆహుతవుతున్న అడవులు
ఏకధాటిగా కాలిపోతున్న
జంబుగుంపల ఫారెస్ట్
వివిధ రకాల వృక్షాలతో పాటు
పలు వన్యప్రాణులు బుగ్గి
సిబ్బందిని నియమించాలి
కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనే జంబుగుంపల అడవి అతిపెద్దది. నలుగురు సిబ్బందికి గాను ఒక్కరు మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నారు. గతంలో అడవుల సంరక్షణకు ప్రభుత్వం సిబ్బందితో పాటు ప్రైవేటు వ్యక్తులను ప్రొటెక్షన్ వాచర్లుగా నియమించేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోవడంతో అడవుల పరిరక్షణ కరువైంది.
– అతావుల్లా, రైతు సంఘం నేత, కుందుర్పి
నిప్పు పెడితే చట్టపరమైన చర్యలు
అడవులకు నిప్పు పెట్టినట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలతో పాటు జిల్లా అటవీశాఖ ఆదేశాలతో క్రిమినల్ కేసులు సైతం పెడతాం. అడవుల పరిరక్షణలో భాగంగా నిఘా ఉంచాం. త్వరలోనే ఆకతాయిలను గుర్తించి చర్యలు తీసుకుంటాం. – పరమేశ్వరప్ప,
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, జంబుగుంపల


