మందకొడిగా కందుల కొనుగోళ్లు
అనంతపురం అగ్రికల్చర్: నాఫెడ్, మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో చేపట్టిన కందుల కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) క్వింటా రూ.8 వేల ప్రకారం 31 మండలాల్లోనూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 1,900 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. వాస్తవ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతానికి 20 మండలాల పరిధిలో మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ, వజ్రకరూరు, పెద్దవడుగూరు ప్రాంతాల్లో మాత్రమే కొనుగోళ్లు కాస్త ఎక్కువగా జరుగుతుండగా.. మిగతా ప్రాంతాల్లో తక్కువగా ఉన్నాయి. బెళుగుప్ప, బ్రహ్మసముద్రం, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, గుమ్మఘట్ట, నార్పల, పామిడి, పెద్దపప్పూరు, పుట్లూరు, శింగనమల, తాడిపత్రి మండలాల్లో ఇంకా కొనుగోళ్లు మొదలు కాలేదు.
అంచనాకు మించి సాగు..
ఈ ఏడాది అంచనాకు మించి ప్రధానపంట వేరుశనగను వెనక్కు నెట్టి జిల్లాలో 1.35 లక్షల హెక్టార్ల (3.37 లక్షల ఎకరాలు)లో రైతులు కంది సాగు చేశారు. అంతోఇంతో పంట చేతికి వచ్చినా.. బహిరంగ మార్కెట్‌లో క్వింటా రూ.7,500కు మించి ధర లభించడం లేదు. దీంతో ఎంఎస్‌పీ సెంటర్ల ద్వారా అమ్ముకునేందుకు వేచిచూస్తున్నారు. ఈ–క్రాప్ ఆధారంగా ఎకరాకు 4 క్వింటాళ్ల చొప్పున కొనుగోలుకు అనుమతించారు. ఈ లెక్కన 3.37 లక్షల ఎకరాల నుంచి 1.35 లక్షల మెట్రిక్ టన్నుల మేర కంది పంట చేతికిరావచ్చని అంచనా వేశారు.
కావాలనే కొనుగోళ్లలో ఆలస్యం!
ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి 24,838 మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యం పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే 13,200 మంది రైతులు 28 వేల మెట్రిక్ టన్నుల వరకు అమ్ముకునేందుకు ఆర్‌ఎస్‌కేల్లో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఇంకా మరికొంతమంది రైతులు కందులు అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. అనుకున్నంత వేగంగా కొనుగోళ్లు జరగకపోవడంతో రిజిస్ట్రేషన్లు చేసుకున్న రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎంత ఆలస్యం చేస్తే అంత మేర రైతులు బయట అమ్ముకునేందుకు మొగ్గు చూపుతారనే ఆలోచనతోనే కొనుగోళ్లు నెమ్మదిగా చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటి వరకు 1,900
మెట్రిక్ టన్నుల సేకరణ
28 వేల మెట్రిక్ టన్నులకు
రైతుల రిజిస్ట్రేషన్లు


