ఆటో బోల్తా.. వ్యక్తి మృతి
గుంతకల్లుటౌన్: ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన ఘటన పట్టణ శివారులో జరిగింది. గుంతకల్లు వన్‌టౌన్ పోలీసుల కథనం మేరకు.. నంద్యాల జిల్లా ప్యాపిలికి చెందిన బేల్దారి వడ్డే సుబ్రహ్మణ్యం (40) శనివారం తన తల్లి పార్వతమ్మతో కలిసి వజ్రకరూరులో తన పెద్దమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చాడు. అంత్యక్రియల అనంతరం తిరిగి తన స్వగ్రామం వెళ్లేందుకు ఆటోలో గుంతకల్లుకు బయల్దేరాడు. సుమారు 10 మందితో బయలుదేరిన ఆటో కొనకొండ్ల రోడ్డులోని మారెమ్మ గుడి సమీపంలో కల్వర్టు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ఈ క్రమంలో కిందపడిన వడ్డే సుబ్రహ్మణ్యం తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న గుంతకల్లు మండలం చింతలాంపల్లికి చెందిన కలిశెట్టి శ్రీదేవి, వజ్రకరూరుకు చెందిన నీలమ్మ, వెంకటరాముడు, తులసమ్మ గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆటోడ్రైవర్ ఉడాయించినట్లు తెలిసింది. కళ్లెదుటే కుమారుడు మృతి చెందడంతో సుబ్రహ్మణ్యం తల్లి పార్వతమ్మ గుండెలవిసేలా రోదించింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నట్లు తెలిసింది. ఘటనాస్థలాన్ని వన్‌టౌన్ సీఐ మనోహర్ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
● మరో నలుగురికి గాయాలు


