టీడీపీ నేతల కనుసన్నల్లో ఇసుక అక్రమ రవాణా
● 2 లారీలను సీజ్ చేసిన అధికారులు
కుందుర్పి: టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఇసుక అక్రమ రవాణా సాగుతున్న విషయం మరోసారి బట్టబయలైంది. నిత్యమూ అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు రాత్రి సమయాల్లో కుందుర్పి మీదుగా వందల సంఖ్యలో లారీలు, టిప్పర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న అంశంలో అధికారుల తీరుపై స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో మంగళవారం అర్ధరాత్రి జిల్లా కేంద్రానికి ఇసుకను తరలిస్తున్న రెండు భారీ వాహనాలను కుందుర్పి మండలం వెంకటాంపల్లి వద్ద గనుల శాఖ అధికారులు అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. ఇసుక తరలింపునకు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో ఆ వాహనాలను సీజ్ చేసినట్లు గనుల శాఖ ఏజీ నారాయణ తెలిపారు. కాగా, మండలంలోని జంబుగుంపల, నిజవళ్లి, ఎనుములదొడ్డి, అల్లాపురం, బసాపురం పంచాయతీల పరిధి నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా లారీలు, ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా కర్ణాటక ప్రాంతాలతో పాటు కళ్యాణదుర్గానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లుగా ఆరోపణలున్నాయి.
సంక్రాంతి ఆటవిడుపు
బత్తలపల్లి: అనంతపురం, బత్తలపల్లి వైద్యుల మధ్య సంక్రాంతి ఆటవిడుపుగా గురువారం నిర్వహించిన క్రికెట్ పోటీ ఉత్సాహంగా సాగింది. బత్తలపల్లిలోని ఆర్డీటీ క్రీడా మైదానంలో నిర్వహించిన ఈ పోటీల్లో బత్తలపల్లి వైద్యుల జట్టులో ఎస్పీ సతీష్‌కుమార్, ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్, సీఐలు నాగేంద్ర ప్రసాద్, ప్రభాకర్‌గౌడు ఆడారు. టాస్ గెలిచిన బత్తలపల్లి డాక్టర్ల జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 25 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. జట్టులో ఇర్ఫాన్ 90 పరుగులు, ఎస్పీ సతీష్‌కుమార్ 31 పరుగులు, ధర్మవరం టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ 30 పరుగులు, రూరల్ సీఐ ప్రభాకర్‌గౌడ్ 14 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ బరిలో దిగిన అనంతపురం డాక్టర్ల జట్టు 24 ఓవర్లలో 185 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. 28 పరుగులతో బత్తలపల్లి డాక్టర్ల జట్టు విజయం సాధించింది. ఎస్పీ సతీష్‌కుమార్ 3 వికెట్లు సాధించారు. బ్యాటింగ్‌లో రాణించిన ఇర్ఫాన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఎస్పీ అందజేశారు.
టీడీపీ నేతల కనుసన్నల్లో ఇసుక అక్రమ రవాణా


