మాటలు కాదు.. బహిరంగ చర్చకు రా
● జేసీ సవాల్ స్వీకరిస్తున్నా
● తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
అనంతపురం: రాయలసీమ పౌరుషంపై వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టడం కాదు.. దమ్ముంటే అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రతి సవాల్ విసిరారు. ఇందుకు సిద్ధమైతే వెంటనే తేదీ ఖరారు చేసి, ఎస్పీ ద్వారా అనుమతులు తీసుకోవాలని, చర్చ ఎక్కడ పెట్టినా తాను సిద్ధమని పేర్కొన్నారు. ‘కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద పెడతవా? అనంతపురంలోని టవర్ క్లాక్ సెంటర్‌ను ఎంచుకుంటావా? లేదా కడపలోని కోటిరెడ్డి సర్కిల్ కావాలో ఎక్కడైనా సరే చర్చిద్దాం’ అంటూ సవాల్ చేశారు. తాను, తన కుటుంబ సభ్యులు మాత్రమే వస్తామని స్పష్టం చేశారు. అనంతపురంలోని తన నివాసంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం మగతనం కాదని తెలుసుకోవాలన్నారు. ప్రతిసారీ తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ జేసీ ప్రగల్భాలకు పోతున్నారన్నారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి 30 ఏళ్ల పాలనపై... ఎమ్మెల్యేగా ఐదేళ్ల తన పాలనపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. అమాయకులను రెచ్చగొట్టి తాడిపత్రిలో అక్రమ కేసులు పెట్టిస్తామంటే ఎవరూ మౌనంగా ఉండబోరన్నారు. తాడిపత్రి డివిజన్‌లో పోలీసులు దాదాపు జేసీ కనుసన్నల్లోనే నడుస్తున్నారు తప్ప.. ఎస్పీ ఆదేశం అక్కడ పనిచేయదన్నారు. మట్కా అంశంలో అసలు సూత్రధారులను అరెస్ట్ చేయకుండా అడ్డుకుంటూ సాధారణ బీటర్లను బలి పశువులను చేసి మట్కాను కూకటి వేళ్లతో పెకలిస్తున్నామంటూ బీరాలకు పోతున్నారని ఎద్దేవా చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వాస్తవాలు మాట్లాడితే జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఎందుకు అంత ఉలుకో అర్థం కావడం లేదన్నారు. వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై విమర్శ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాయలసీమ పౌరుషం ఏమిటో చూడాలనుకుంటే అమాయకులను రెచ్చగొట్టకుండా రెండు కుటుంబాల వారు మాత్రమే తేల్చుకుందామంటూ మరో సవాల్ విసిరారు. తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేతల అక్రమాలపై ఇప్పటికే కలెక్టర్‌కు రెండు సార్లు ఫిర్యాదు చేశానని, విచారణ జరక్కుండా జేసీ ప్రభాకర్‌రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు.సాక్షాత్తూ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.


