ప్రమాదమా.. హత్యా?
కూడేరు: మండలంలోని ఎన్‌సీసీ నగర్ వద్ద జాతీయ రహదారి పక్కన ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించారు. గొటుకూరు వీఆర్వో కుళ్లాయిస్వామి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. దాదాపు 55 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉండవచ్చునని అంచనా వేశారు. నుదుటన, శరీరంపై బలమైన రక్తగాయాలు ఉన్నాయి. రహదారి వెంట నడుచుకుంటూ వెళుతుండగా వాహనం ఢీకొని మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించి, మృతదేహాన్ని సర్వజనాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? లేదా ఎక్కడైనా హత మార్చి ఇక్కడ పడేశారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.


