పండుగపూట అంతులేని విషాదం
● వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
పామిడి: వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు యువకుల మృతితో పండుగ పూట రెండు కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన మేరకు.. పామిడిలోని వెంగమనాయుడు కాలనీకి చెందిన ద్వారక గజని (21) బుధవారం సాయంత్రం కాలినడకన ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద 44వ జాతీయ రహదారి దాటుతుండగా బెంగుళూరు వైపు నుంచి గుత్తి వైపుగా వెళుతున్న లారీ ఢీకొంది. ఘటనలో గజని అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఘటనలో వైఎస్సార్ కడప జిల్లా పులివెందులకు చెందిన 10 వతరగతి విద్యార్థి ప్రేమ్ మృతి చెందాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా తన తల్లితో కలసి గుత్తిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చిన ప్రేమ్.. పెద్దవడుగూరు మండలం మిడుతూరులోని పెద్దమ్మను చూసేందుకు స్కూటర్‌పై వెళ్లాడు. అనంతరం స్కూటర్‌పై పామిడికి బయలుదేరిన బాలుడు.. స్థానిక వై జంక్షన్ వద్దకు చేరుకోగానే వెనుకనే వస్తున్న టాటా ఏఎస్ వాహనం ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రేమ్‌ను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురంలోని సర్వజనాస్పత్రికి వైద్యులు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
వృద్ధురాలి బలవన్మరణం
అనంతపురం సెంట్రల్: జీవితంపై విరక్తితో ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురంలోని నవయుగ కాలనీకి చెందిన శంకరమ్మ (67) మానసిక స్థితి సరిగా లేదు. కుటుంబసభ్యులు చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి పెంచుకున్న ఆమె మంగళవారం సాయంత్రం హెచ్చెల్సీలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నాల్గో పట్టణ సీఐ జగదీష్ తెలిపారు.
సౌత్‌జోన్ జట్టుకు 8 మంది ఎంపిక
అనంతపురం కార్పొరేషన్: అండర్ –14 సౌత్‌జోన్ క్రికెట్ జట్టుకు అనంతపురం జిల్లాకు చెందిన 8 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి యుగంధర్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఎంపికై న వారిలో ఆర్.హవీష్‌రెడ్డి, జగదీష్ యాదవ్, ఎస్.మహమ్మద్‌తన్వీర్, దిషిక్‌రెడ్డి, సగప్రతీక్, పి.రేహాన్, వి.చరణ్‌తేజ్, జి.ధనుష్ ఉన్నారు.
పండుగపూట అంతులేని విషాదం


