గొర్రెల దొంగల అరెస్ట్
పెద్దవడుగూరు: ఈ నెల 9న పెద్దవడుగూరుకు చెందిన కాపరి నెట్టికంటయ్య పోషిస్తున్న గొర్రెలను అపహరించిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం స్థానిక పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ రామసుబ్బయ్య, ఎస్‌ఐ ఆంజనేయులుతో కలసి తాడిపత్రి ఏఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి వెల్లడించారు. గొర్రెల అపహరణపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పక్కా ఆధారాలతో బుధవారం రాప్తాడు మండలం చిన్మయనగర్‌లోని ఇందిరమ్మ కాలనీకి చెందిన డేరంగుల విజయ్‌కుమార్, అనంతపురంలోని చంద్రబాబుకొట్టాలకు చెందిన మొండి నాగార్జున అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. నేరాన్ని అంగీకరించడంతో వారి నుంచి రూ.7.50 లక్షల విలువైన 30 గొర్రెలు, 30 మేకలు, 12 పొట్టేళ్లు, టాటా పికప్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వానరానికి అంత్యక్రియలు
గుంతకల్లు రూరల్: స్థానిక మస్తాన్‌వలి దర్గా సమీపంలో బుధవారం ఓ వానరం మృతి చెందడంతో సమాచారం అందుకున్న గోహిత సేవా సమితి సభ్యులు అక్కడకు చేరుకుని పట్టణ శివారు ప్రాంతంలో ఖననం చేశారు. కార్యక్రమంలో సమితి సభ్యులు వరప్రసాద్, వాల్మీకి వంశీ, పురుషోత్తం, అనిల్ అరీఫ్ బాషా, ఫకృద్ధీన్ తదితరులు పాల్గొన్నారు.
అతిగా మద్యం సేవించి
వ్యక్తి మృతి
తాడిపత్రి రూరల్: స్థానిక గన్నెవారిపల్లి కాలనీకి చెందిన శివశంకర్‌రెడ్డి (36) అతిగా మద్యం సేవించి నీటి కుంటలో పడి మృతి చెందాడు. ఈ మేరకు తాడిపత్రి అప్‌గ్రేడ్ సీఐ శివగంగాధర్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం అతిగా మద్యం సేవించిన శివశంకరరెడ్డి మత్తులో రావివెంకటాంపల్లి సమీపంలో రోడ్డు పక్కన ఉన్న నీటి కుంటలో పడి మృతి చెందాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా, మద్యానికి బానిసగా మారి జులాయిగా తిరుగుతుండడంతో శివశంకరరెడ్డిని గతంలో భార్య వదిలేసిందని, ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడని పోలీసులు వివరించారు.
గొర్రెల దొంగల అరెస్ట్


