ఆదరణ కోల్పోయి.. ఉపాధి కరువై
● బతుకు భారమైందంటున్న గంగిరెద్దుల కళాకారులు
తాడిపత్రి రూరల్: సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటలు, హరిదాసులు, గంగిరెద్దుల కళాకారుల శోభ కంటి ముందు కదలాడుతూ ఉంటుంది. పల్లెల్లో అయితే గంగిరెద్దులను సాక్షాత్తూ దైవస్వరూపంగా భావించి పూజించేవారు. అయితే ఈ ఏడాది సంక్రాంతి శోభ కాస్త సన్నగిల్లింది. అరటి తదితర పంటలకు గిట్టుబాటు ధర లేక నష్టపోయిన రైతులు పండుగ జరుపుకోవడంలో ఉదాసీనంగా ఉండిపోయారు. పండుగ చేయాలంటే చేయాలి అనే ధోరణి గ్రామాల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో గంగిరెద్దులకు ఆదరణ కరువైంది. దీంతో పట్టణ ప్రాంతానికి గంగిరెద్దుల కళాకారులు చేరుకుని ఇంటింటికీ తిరుగుతూ వారిచ్చే కానుకలను తీసుకోవడం కనిపించింది. గమనించిన ‘సాక్షి’ వారిని పలకరిస్తే చెమ్మగిల్లిన కళ్లతో తమ కష్టాన్ని వారు పంచుకున్నారు.


