హత్య కేసులో నిందితుడి అరెస్ట్
అనంతపురం సెంట్రల్: నగరంలోని పాతూరు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు ఆవరణలో ఈ నెల 8న చంద్రబాబు కొట్టాలకు చెందిన బోయ ఆంజనేయులు హత్య చేసిన ఘటనలో నిందితుడు మేకల వంశీని అరెస్ట్ చేసినట్లు వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు. నగర పాలక సంస్థ తాగునీటి విభాగంలో పనిచేస్తున్న ఆంజనేయులు, వంశీ మధ్య కొంత కాలంగా మనస్పర్థలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ నెల 8న రాత్రి 2 గంటల సమయంలో విధుల్లో ఉన్న సమయంలో వంశీ రాయితో తలకు బాదడంతో ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు.
55 శాతం రాయితీతో
డ్రిప్ ఆటోమేషన్
అనంతపురం అగ్రికల్చర్: ఉద్యాన తోటల్లో సూక్ష్మ సాగు సేద్యానికి దోహదపడేలా ఆటోమేషన్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయని ఏపీఎంఐపీ పీడీ బి.రఘునాథరెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆటోమేషన్ అనుసంధానం వల్ల నీటితో పాటు ఎరువులను సరైన విధానంలో మొక్క వేర్లకు అందించేందుకు వీలవుతుందన్నారు. నీటి వృథా, ఎరువుల వృథా బాగా తగ్గిపోతుందన్నారు. పొలంలో ఏ భాగానికి నీరు ఇవ్వాలో వాల్వులు, ఇతరత్రా వాటిని చేతిలో తిప్పాల్సిన పనిలేకుండా సెన్సార్ వ్యవస్థ ద్వారా యంత్రాలే నియంత్రిస్తాయన్నారు. వర్షం పడుతున్నపుడు, నీరు ఎక్కువగా వెళుతున్నపుడు సెన్సార్ వ్యవస్థకు సమాచారం అందడంతో ఆటోమేటిక్‌గా పంపు ఆఫ్ అవుతుందని తెలిపారు. రూ.40 వేలు విలువ చేసే వీటిని సన్న, చిన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీ రైతులకు 55 శాతం రాయితీ, మిగిలిన రైతులకు 45 శాతం రాయితీతో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైన రైతులు ఏపీఎంఐపీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
బంగారు గొలుసు అపహరణ
గుమ్మఘట్ట: రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో నివాసముంటున్న వివాహిత సునీత మెడలోని బంగారు గొలుసును దుండగులు అపహరించారు. బాధితురాలు తెలిపిన మేరకు.. భర్త రాజన్నతో కలసి చిల్లకొట్టు దుకాణం నిర్వహిస్తున్న సునీత మంగళవారం ఉదయం దుకాణంలో ఉన్న సమయంలో ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులు వచ్చారు. ఇద్దరూ హెల్మెట్ ధరించి ఉన్నారు. వీరిలో ఒకరు బైక్‌పై ఉండగా, మరొకరు సునీత వద్దకెళ్లి రూ.100 ఇచ్చి సిగరెట్లు, కూల్‌డ్రింక్ బాటిళ్లు ఇవ్వాలని అడిగాడు. అతను అడిగిన వాటిని ఇచ్చి చిల్లర ఇచ్చే సమయంలో ఆమె మెడలోని 1.5 తులాల బంగారు గొలుసును దుండగుడు లాక్కొని ద్విచక్ర వాహనంపై సహచరుడితో కలసి ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు.
ప్రమాదంలో కౌన్సిలర్‌కు తీవ్ర గాయాలు
రాయదుర్గం టౌన్: స్థానిక మున్సిపల్ పరిధిలోని 18వ వార్డు కౌన్సిలర్ (వైఎస్సార్‌సీపీ) ఐనాపురం మంజునాథ్ మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు చోటు చేసుకున్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. రాయదుర్గం నుంచి మొలకాల్మూరు వైపుగా ద్విచక్ర వాహనంపై వెళుతుండగా పైతోట సమీపంలో జాతీయ రహదారిపై వాహనం అదుపు తప్పి కిందపడ్డాడు. మంజునాథ తలకు బలమైన గాయం కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు గమనించి 108 అంబులెన్స్ ద్వారా స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బళ్లారి విమ్స్‌కు కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. కాగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
తాళం వేసిన ఇంట్లో చోరీ
రాయదుర్గం టౌన్: స్థానిక 29వ వార్డు కుమ్మరగుండ్ల వీధిలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు... గార్మెంట్స్ పరిశ్రమలో పనిచేస్తున్న తౌఫిక్ ఆదివారం ఇంటికి తాళం వేసి కర్ణాటకలోని హోస్పేటలో బంధువుల ఇంట జరుగుతున్న శుభకార్యానికి కుటుంబసభ్యులతో కలసి వెళ్లాడు. సోమవారం రాత్రి తిరిగి వచ్చారు. అప్పటికే ఇంటి తలుపులు తీసి ఉండడంతో లోపలకు వెళ్లి పరిశీలించారు. బీరువాలో దాచిన రూ.1.40 లక్షల నగదు, 18 తులాల వెండి నగలు, తులం బరువున్న రెండు బంగారు ఉంగరాలు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో మంగళవారం ఉదయం పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ ప్రసాద్ తెలిపారు.
హత్య కేసులో నిందితుడి అరెస్ట్


