తల్లి మందలింపు.. యువకుడి బలవన్మరణం
పెద్దవడుగూరు: తల్లి మందలింపుతో క్షణికావేశానికి లోనై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... పెద్దవడుగూరు మండలం నాగలాపురం గ్రామానికి చెందిన మాదిగ నవీన్(19) అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రోజూ కళాశాలకు వెళ్లి వచ్చేవాడు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఇంటి వద్దనే ఉంటూ జులాయిగా తిరుగుతుండడంతో మంగళవారం తల్లి లక్ష్మి మందలించింది. ఏదైనా పనికి వెళితే పండుగ ఖర్చుకు డబ్బులు వస్తాయని హితవు పలికింది. దీంతో తల్లితో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. సాయంత్రం గ్రామ శివారున పొలాల్లో పురుగుల మందు సేవించి ఆపస్మారక స్థితిలో పడి ఉండడంతో గమనించిన రైతుల నుంచి సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు వెంటనే పామిడిలోని సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. చికిత్సకు స్పందించక అనంతపురంలోని ఆస్పత్రిలో నవీన్ మృతి చెందాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
గొరిదిండ్ల సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా
ఆత్మకూరు: మండలంలోని గొరిదిండ్ల, గొరిదిండ్ల తండా, ముట్టాల, పాపంపల్లి గ్రామాలకు గొరిదిండ్ల సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరాను అధికారులు చేపట్టారు. సబ్ స్టేషన్‌ను ప్రారంభించి నాలుగు నెలలవుతున్నా విద్యుత్ సరఫరా చేపట్టక పోవడంతో ఆత్మకూరు సబ్ స్టేషన్ నుంచి ఆయా గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసేవారు. ఈ క్రమంలో లో ఓల్టేజీ కారణంగా ఒకే రోజు 70 మోటార్లు కాలిపోయిన అంశంపై ‘ప్రచార ఆర్భాటం.. రైతుకు శాపం’ శీర్షికన ఈ నెల 7న ‘సాక్షి’లో ప్రచురితమైంది. ఈ కథనంపై స్పందించిన మండల ఏఈ దాస్.. సిబ్బందితో కలసి మరుసటి రోజు ఆయా గ్రామాల్లో పర్యటించి రైతుల ఇబ్బందులు తెలుసుకున్నారు. అనంతరం ప్రజాప్రతినిధులతో చర్చించి గొరిదిండ్ల సబ్‌స్టేషన్ ద్వారా మంగళవారం నుంచి విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు.
ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరులపై ఫిర్యాదు..!
అనంతపురం సెంట్రల్: ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరుడు గంగారం, మరికొందరు తమ భూమిని కబ్జా చేస్తున్నారని టీడీపీకి చెందిన రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ స్వప్న మంగళవారం రాత్రి నాల్గో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ మండలం ఏ.నారాయణపురం పొలంలో 179 సర్వే నంబర్‌లోని 43 సెంట్లు స్థలం ఇటీవల వివాదాస్పదంగా మారింది. తమ పూర్వీకుల నుంచి వస్తున్న స్థలాన్ని ఎవరో కబ్జా చేశారని డిసెంబర్ 29న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ జగదీష్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అయితే అందులో ఎవరిపేర్లూ లేకపోవడంతో మరోసారి ఫిర్యాదు ఇవ్వాలని పోలీసు అధికారుల స్వప్నకు సూచించారు. దీంతో మంగళవారం రాత్రి ఆమె నాల్గో పట్టణ పోలీసుస్టేషన్‌లో మరోసారి ఫిర్యాదు చేశారు. అయితే చైర్‌పర్సన్ స్వప్న మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. వివరాలు చెప్పేందుకు పోలీసులు సైతం నిరాకరించారు.
తల్లి మందలింపు.. యువకుడి బలవన్మరణం


