రైల్వే ఆదాయ వనరులు మెరుగుపడాలి
● దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాథూర్
గుంతకల్లు: రైల్వే ఆదాయ వనరులు మరింత మెరుగు పడాలని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉద్యోగులకు దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాథూర్ పిలుపునిచ్చారు. దక్షిణ మధ్య రైల్వే నుంచి గుంతకల్లు డివిజన్ విడిపోయి దక్షిణ కోస్తా రైల్వేలో విలీనం కానున్న నేపథ్యంలో తొలిసారిగా దక్షిణ కోస్తా రైల్వే జీఎం గుంతకల్లు, విజయవాడ, గుంటూరు డివిజన్ల అధికారులతో మంగళవారం వీసీలో మాట్లాడారు. గుంతకల్లు నుంచి డీఆర్‌ఎం చంద్రశేఖర గుప్తా, ఏడీఆర్‌ఎం సుధాకర్, వివిధ శాఖ డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంతకల్లు డివిజన్ సమగ్ర సమాచారాన్ని మాథూర్ అడిగి తెలుసుకున్నారు. డివిజన్‌లో చేపట్టిన అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అనంతరం జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ, ఉద్యాన శాఖ అధికారులతో డీఆర్‌ఎం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఉద్యాన పంటల ఎగుమతులకు అన్ని విధాలుగా సహకరిస్తామని డీఆర్‌ఎం పేర్కొన్నారు. ప్రత్యేక గూడ్స్ రైళ్లు నడపడానికి చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు నష్టపోకుండా టైమ్ టేబుల్ ప్రకారం నిర్ణీత సమయంలో పంట దిగుమతులను గమ్యస్థానాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ సూచించారు.
అరటి ఎగుమతికి ప్రత్యేక చర్యలు
అనంతపురం అర్బన్: జిల్లా నుంచి అరటి ఎగుమతులకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబుకు ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తెలిపారు. రైలు మార్గం ద్వారా సకాలంలో రవాణా జరగడం లేదన్నారు. అరటి ఎగుమతులపై ముఖ్యకార్యదర్శి మంగళవారం విజయవాడ నుంచి కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి ఇన్‌చార్జ్ కలెక్టర్‌తో పాటు ఉద్యాన శాఖ డీడీ పద్మావతి, గుంతకల్లు రైల్వే డివిజన్ డీఆర్‌ఎం చంద్రశేఖర్‌గుప్త, ఇతర అధికారులు పాల్గొన్నారు. రైలు మార్గం ద్వారా అరటి ఎగుమతులు అధికంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. లాజిస్టిక్ సమస్యల వల్ల రవాణా ఖర్చులు ఎక్కువగా ఉండడంతో ఎగుమతి దారులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. తాడిపత్రితో పాటు జంగాలపల్లి, ప్రసన్నాయలపల్లి, మరికొన్ని రైల్వే స్టేషన్ల నుంచి ఎగుమతులకు అవకాశం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.


