రెచ్చగొట్టేవారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
● సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి
అనంతపురం అర్బన్: విద్వేషాలతో రెచ్చగొడుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి డిమాండ్ చేశారు. అనంతపురంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో సహాయ కార్యదర్శులు చిరుతల మల్లికార్జున, జె.రాజారెడ్డి, ఇతర నాయకులతో కలిసి మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని, పేదలకు సంక్షేమ పథకాల కల్పనలో దుర్మార్గపు నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. పీపీపీ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులతో బుధవారం భోగిమంటల కార్యక్రమం ద్వారా నిరసన తెలియజేస్తామన్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే కుట్రపూరిత ఆలోచనను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఉన్న నరిగమ్మ ఆలయ అంశంలో కోర్టు ఉత్తర్వులను అమలు పర్చాలని డిమాండ్ చేశారు. గుడి పేరుతో ప్రజల మధ్య విభేదాలను సృష్టిస్తున్న వ్యక్తులు, సంఘాలను ఉపేక్షించకూడదన్నారు. సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు రాజేష్‌గౌడ్, రామాంజనేయులు, మండల కార్యదర్శి నరేష్, తదితరులు పాల్గొన్నారు.


