11 మండలాల్లో నీటిమట్టం తగ్గుముఖం
అనంతపురం అగ్రికల్చర్: భూగర్భజలాల పరిస్థితి ఆశాజనకంగానే కనిపిస్తున్నా.. 11 మండలాల్లో నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. భూగర్భజలశాఖ తాజాగా 97 ఫిజోమీటర్ల నుంచి సేకరించిన గణాంకాల ప్రకారం జిల్లా సగటు నీటిమట్టం 11.86 మీటర్లుగా నమోదైంది. సగటు నీటి మట్టం కన్నా 11 మండలాల్లో భూగర్భజలాలు కాస్తంత తగ్గుముఖం పట్టినట్లు స్పష్టమవుతోంది. ఈ వర్షపు సంవత్సరంలో ఇప్పటి వరకు 463.1 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉడగా 30.3 శాతం అధికంగా అంటే 603.6 మి.మీ నమోదైంది. దీంతో పాతాళగంగ పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా అంతటా 40.94 టీఎంసీలు అందుబాటులో ఉండగా అందులో 14.45 టీఎంసీలు వినియోగిస్తున్నారు. ఇంకా 26.49 టీఎంసీల భూగర్భజలాలు మిగులు కింద ఉన్నట్లు ఆ శాఖ అధికారులు నివేదికలో పేర్కొన్నారు.
డేంజర్ జోన్‌లో నార్పల
అత్యధిక నీటివినియోగం కలిగిన నార్పల మండలం పూర్తి డేంజర్ జోన్‌లో ఉంది. అలాగే బ్రహ్మసముద్రం, డీ.హీరేహాళ్, కళ్యాణదుర్గం, కూడేరు, కుందుర్పి, పామిడి, పుట్లూరు, శెట్టూరు, తాడిపత్రి, యాడికి మండలాల్లో కూడా నీటి వినియోగం అధికంగా ఉండటంతో భూగర్భజలాలు తగ్గుముఖం పడుతున్నట్లు గుర్తించారు. 20 మండలాల్లో ఫిజోమీటర్ల ద్వారా 8 నుంచి 20 మీటర్లలో నీటిమట్టం కనిపిస్తోందని చెబుతున్నారు.
● జిల్లా వ్యాప్తంగా బోరుబావులు 1,87,610 వినియోగిస్తుండగా, భూమి, నీరు, చెట్టు చట్టం (వాల్టా) కింద 13 గ్రామ పంచాయతీల్లో బోరుబావుల తవ్వకాన్ని నిషేధించారు. వేసవి కావడం వల్ల ఏప్రిల్, మే నెలల్లో మరింత తగ్గుముఖం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. వర్షాలు వచ్చే పరిస్థితి ఉన్నందున జూన్ నుంచి తిరిగి భూగర్భజలాలు పెరగవచ్చని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
13 గ్రామపంచాయతీల్లోబోరుబావుల తవ్వకం నిషేధం
జూన్‌లో భూగర్భజలాలు పెరిగే చాన్స్


