ఆశతో వచ్చాం.. ఆదుకోండి
అనంతపురం అర్బన్: ‘ఎంతో ఆశతో మీ వద్దకు వచ్చాం. కరుణించి ఆదుకోండి’ అంటూ కలెక్టర్, ఇతర అధికారులను ప్రజలు వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ వి.వినోద్‌కుమార్‌తో పాటు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్‌ఓ ఎ.మలోల, ఎఫ్‌ఎస్‌ఓ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రమేష్‌రెడ్డి, తిప్పేనాయక్, జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 492 వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీల పరిష్కార క్రమంలో ఏ స్థాయిలోనూ నిర్లక్ష్యానికి తావివ్వకూడదన్నారు. అర్జీదారునితో మాట్లాడి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకుని వారు సంతృప్తి చెందేలా నాణ్యతగా పరిష్కరించడంతో పాటు ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని ఆదేశించారు.
వినతుల్లో కొన్ని....
● చీనీ మార్కెట్ యార్డులో ఈనామ్ వ్యవస్థను రద్దు చేసి వేలం ద్వారా అమ్మకాలు జరపాలని రైతు సంఘం నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, బీహెచ్‌రాయుడు, రాజారాంరెడ్డి విన్నవించారు. నిబంధనలకు విరుద్ధంగా కమీషన్ 10 శాతం వసూలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సూట్ విధానం అరికట్టాలన్నారు.
● తమ తాత పేరున ఉన్న భూమిని వేరొకరు వారి పేరున ఆన్‌లైన్‌లో ఎక్కించుకున్నారని అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లికి చెందిన తిరుపతయ్య ఫిర్యాదు చేశాడు. బుక్కరాయసముద్రం సిద్ధరాంపురం సర్వే నంబరు 336–1లో 5.08 ఎకరాలు తమ తాత పేరున ఉందని చెప్పాడు. అయితే ముగ్గురు వ్యక్తులు భూమిని తమ పేరున ఎక్కించుకున్నారని, విచారణ చేసి న్యాయం చేయాలని కోరాడు.
● గ్రామకంఠం స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించి ప్రహరీ నిర్మిస్తున్నాడని గార్లదిన్నె మండలం కమలా పురానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ప్రహరీ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పాడు.
● వితంతు పింఛను మంజూరు చేయించాలని యాడికికి చెందిన కందికుంట రుక్మిణిదేవి విన్నవించింది. తన భర్తకు వృద్ధాప్య పింఛను వచ్చేదని, ఆయన గత ఏడాది జూన్ 12న చనిపోయాడని చెప్పింది. వితంతు పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల వేడుకోలు
వివిధ సమస్యలపై 492 వినతులు
ఈ వృద్ధురాలి పేరు లక్ష్మమ్మ. ఆత్మకూరు మండల కేంద్రంలో నివాసముంటోంది. ఈమెకు నలుగురు కుమారులు సంతానం. భర్త 2016లో చనిపోయాడు. వీరికి సర్వే నంబరు 547–7లో 4.24 ఎకరాల భూమి ఉంది. భూమికి డీ పట్టా, పట్టా నంబరు 3072 పాసుపుస్తకం ఉంది. అయితే, సాగులో ఉన్న తమను భూమిలోకి వెళ్లకుండా కొందరు దౌర్జన్యంగా అడ్డుకుంటున్నారని ఆవేదన చెందింది. కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినా ఇబ్బందికి గురిచేస్తున్నారని చెప్పింది.
ఆశతో వచ్చాం.. ఆదుకోండి


