
జ్యోతిరావ్ పూలే చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కలెక్టర్ వినోద్‌కుమార్
అనంతపురం అర్బన్: బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన జ్యోతిరావ్ పూలే చిరస్మరణీయులని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జ్యోతిబా పూలే 198వ జయంతి నిర్వహించారు. బీసీ సంక్షేమాధికారి కుష్బూ కొఠారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జ్యోతిరావ్ పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. జెడ్పీ సీఈఓ వైఖోమ్ నిదియాదేవి, నగర పాలక కమిషనర్ మేఘస్వరూప్, డీఆర్‌ఓ జి.రామకృష్ణారెడ్డి కూడా నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడారు. అంటరానితనం, కులవివక్ష నిర్మూలన, మహిళాభ్యున్నతి, విద్యాభివృద్ధికి జ్యోతిరావ్ పూలే ఎనలేని కృషి చేశారన్నారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కేజీబీవీ, ఇతర పాఠశాల విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని బహమతులు గెలిచి జిల్లాకు కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ జేడీ మధుసూదన్‌రావు, డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, డీపీఓ ప్రభాకర్, ఐఈడీఎస్ పీడీ శ్రీదేవి, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి రామసుబ్బారెడ్డి, డీఐపీఆర్‌ఓ గురుస్వామిశెట్టి, కలెక్టరేట్ ఏఓ అంజన్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి
ఎన్నికల పరిశీలకులు జిల్లాకు విచ్చేయనున్నారని, ఈ క్రమంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిశీలకుల రాక నేపథ్యంలో స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహాన్ని కలెక్టర్ గురువారం సందర్శించారు. పరిసరాలు పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతిథిగృహంలో అవసరమైన ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలన్నారు. నియోజకవర్గానికి ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరిశీలకులకు అవసరమైన నివేదికలను సకాలంలో అందించాలని చెప్పారు. పరిశీలకుల కోసం ఏర్పాటు చేసిన అధికారుల బృందాలు అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో నగర పాలక కమిషనర్ మేఘస్వరూప్, ఆర్‌డీఓ జి.వెంకటేష్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ ఓబుళరెడ్డి, నోడల్, లైజన్, ఆర్‌అండ్‌బీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయిలో కేజీబీవీ విద్యార్థినుల ప్రతిభ
చిలమత్తూరు: మండల కేంద్రంలోని బైరేకుంట వద్ద ఉన్న కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు జాతీయస్థాయి సీనియర్స్ విభాగంలో జంప్ రోప్ స్కిప్పింగ్ పోటీల్లో బంగారు పతకాలు సాధించారు. పాఠశాల ఎస్‌ఓ సునీత కుమారి మాట్లాడుతూ... మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకూ నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో పాఠశాల విద్యార్థినులు చందుప్రియబాయి, ఎస్.రిన్సీ, టి.గిరిజ బంగారు పతకాలు సాధించారన్నారు. ఇందులో చందుప్రియబాయి అంతర్జాతీయ పోటీలకు ఎంపికై నట్లు చెప్పారు. త్వరలో జపాన్ రాజధాని టోక్యోలో జరిగే పోటీల్లో ఆమె పాల్గొంటారన్నారు.

బంగారు పతకాలు సాధించిన విద్యార్థినులు